న్యూఢిల్లీ, డిసెంబర్ 11: గత మూడు నెలల వ్యవధిలో మహారాష్ట్రలో 766 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ప్రభుత్వానికి రైతులు ఎప్పుడు దగ్గర అవుతారని ఎన్సీపీ-ఎస్సీపీ ఎంపీ ఫాజియా ఖాన్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం రాజ్యసభలో జీరో అవర్ సందర్భంగా ఆమె ఈ విషయాన్ని లేవనెత్తారు. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయని అన్నారు. గత మూడు నెలల కాలంలో 766 మంది రైతులు మరణించినట్టు సాక్షాత్తూ రాష్ట్ర అసెంబ్లీయే ప్రకటించిందన్నారు. వీరిలో 200 కుటుంబాలకు ప్రభుత్వం సహాయం నిరాకరించిందని ఆమె వెల్లడించారు. వరదలు, భారీ వర్షాల కారణంగా మహారాష్ట్రలోని 19 జిల్లాల్లో 14.36 లక్షల హెక్టార్లలో పంట దెబ్బతిన్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి దత్తాత్రేయ భర్నే ప్రకటించారని, అయితే కేంద్రానికి పంపిన నివేదికలో 1,10,309 హెక్టార్ల గురించే ప్రస్తావించారని, 14 లక్షలు ఎక్కడ, ఒక లక్ష ఎక్కడ? మిగిలిన ఎకరాలు ఏమైపోయాయి? ఎందుకీ వ్యత్యాసం, ఎందుకీ వివక్ష? ఇది రైతులకు అన్యాయం చేయడం కాదా? అని ఆమె ప్రశ్నించారు.