న్యూఢిల్లీ, అక్టోబర్ 8: ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పెను సంచలనంగా మారింది. మానవ మేధకు సమానంగా సమస్యలకు పరిష్కారం చూపుతూ విప్లవాత్మకంగా నిలుస్తున్నది. ఇదే ఇప్పుడు ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నది. భారత్‌తోపాటు దక్షిణాసియాలోని ఐదు దేశాల్లో పెద్దఎత్తున ఉద్యోగాలు ప్రమాదం అంచున ఉన్నాయని ప్రపంచ బ్యాంకు (World Bank) తాజా అధ్యయనంలో వెల్లడించింది. ఈ మేరకు ‘సౌత్ ఆసియా డెవలప్మెంట్ అప్డేట్, జాబ్స్, ఏఐ, అండ్ ట్రేడ్’ పేరుతో నివేదిక విడుదల చేసింది.
సుమారు 7 శాతం ఉద్యోగాలు రిస్క్‌లో ఉన్నట్టు తెలిపింది. సంస్థలు ఆటోమేషన్‌ను ఎంచుకుంటున్న నేపథ్యంలో ఉద్యోగుల అవసరం తగ్గుతున్నదని పేర్కొంది. విద్యావంతులు, యువ ఉద్యోగులు, వ్యాపార సేవలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాల్లో మానవ మేధకు ప్రత్యామ్నాయంగా ఏఐని ఎక్కువగా ఉపయోగిస్తున్నట్టు స్పష్టంచేసింది. అందుకే ఆయా రంగాల్లోని ఉద్యోగాలు అధికంగా ప్రభావితమవుతున్నట్టు వెల్లడించింది. మార్కెట్లు, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో 15 శాతం ఉద్యోగాలపై ప్రభావం పడుతుందని పేర్కొంది. మనిషి మార్గదర్శకాల మేరకు వివిధ రకాలుగా కంటెంట్ క్రియేట్ చేసే జెనరేటివ్ ఏఐ హవా నడుస్తున్నదని విశ్లేషించింది.