Vyapam Sacm | న్యూఢిల్లీ, జూలై 12: దాదాపు పదేండ్ల క్రితం మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకున్న వ్యాపం కుంభకోణం దేశ రాజకీయాల్ని తీవ్రంగా కుదిపేసింది. ఉద్యోగ నియామకాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని అధికార బీజేపీపై ఆరోపణలు వెలువడ్డాయి. తాజాగా అలాంటిదే మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. గ్రూప్-2, గ్రూప్-4 (పట్వారీ) ఉద్యోగ పరీక్షల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మధ్యప్రదేశ్ ఎంప్లాయిస్ సెలక్షన్ బోర్డ్ (ఈఎస్‌బీ..గతంలో వ్యాపం) నిర్వహించిన ఉద్యోగ పరీక్షల ఫలితాలు జూన్ 30న వెలువడ్డాయి. ఈ ఫలితాలు వెలువడిన మూడు రోజుల తర్వాత ఉద్యోగ పరీక్షల టాపర్స్ జాబితాను ఈఎస్‌బీ విడుదల చేసింది. గ్రూప్-2, గ్రూప్-4 (పట్వారీ) టాపర్స్‌లో ఏడుగురు అభ్యర్థులు ఒకే పరీక్ష కేంద్రానికి చెందినవారని తెలిసింది. ఈ ఏడుగురు గ్వాలియర్‌లోని ఎన్ఆర్ఐ కాలేజ్ ఎగ్జాం సెంటర్లో పరీక్షలు రాశారు.
ఈ ఎన్ఆర్ఐ కాలేజ్ బీజేపీ ఎమ్మెల్యే సంజీవ్ కుశ్వాహాకు చెందినది కావటం అనుమానాల్ని పెంచాయి. ఆ రాష్ట్రంలో నిర్వహించిన గూప్-2, గ్రూప్-4 (పట్వారీ) ఉద్యోగ పరీక్షలకు 12.79 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 9.78 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఎన్ఆర్ఐ కాలేజీ సెంటర్లో పరీక్షలు రాసిన 1700 అభ్యర్థుల నుంచి ఏడుగురు టాపర్స్‌గా నిలవటంపై పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. టాపర్స్‌గా నిలిచిన ఏడుగురు ఎగ్జాం పేపర్లో హిందీలో సంతకం చేశారని, ఇంగ్లిష్‌లో జవాబులు రాశారని మీడియాలో వార్తలు వెలువడ్డాయి. పరీక్షలు నిర్వహించిన సదరు కంపెనీని కేంద్రం బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిందని, అదే కంపెనీకి మధ్యప్రదేశ్ ప్రభుత్వం పరీక్షల నిర్వహణ టెండర్ అప్పగించిందని కథనాలు పేర్కొన్నాయి. వీటిపై ఎంప్లాయిస్ సెలక్షన్ బోర్డ్ ఇప్పటివరకు స్పందించలేదు.
గ్వాలియర్‌లోని ఎన్ఆర్ఐ కాలేజీ యజమాని బీజేపీ ఎమ్మెల్యే కావటం..తాజా పరీక్షల ఫలితాలపై అనుమానాలు ఏర్పడ్డాయి. ఫలితాల్ని రద్దుచేసి..ఉద్యోగ పరీక్షల్ని మళ్లీ నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ‘పదేండ్ల క్రితం జరిగిన వ్యాపం కుంభకోణాన్ని ఇది గుర్తుచేస్తున్నది. ప్రశ్న పత్రాల్ని బ్రోకర్స్‌కు ముందుగానే అమ్మేశారు. ఇక్కడా అదే జరిగింది’ అని ‘నేషనల్ ఎడ్యుకేటెడ్ యూత్ యూనియన్’ ప్రతినిధి రంజిత్ ఆరోపించారు. రాష్ట్ర చరిత్రలో ఇది చీకటి అధ్యాయంగా..తాజా ఉదంతంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జితూ పట్వారీ వ్యాఖ్యానించారు.
వ్యాపం కుంభకోణం 2013లో వెలుగులోకి వచ్చింది. వ్యాపం నిందితుల్లో అనేకమంది అనుమానాస్పద స్థితిలో చనిపోవటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మధ్యప్రదేశ్ వ్యవసాయిక్ పరీక్ష మండలి నిర్వహించిన ఉద్యోగ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని, ఫలితాల్ని తారుమారు చేసేందుకు..బీజేపీ నేతలకు పెద్ద మొత్తంలో డబ్బులు అందాయని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలకు సంబంధించి పోలీసులు 1000కిపైగా ఎఫ్ఐఆర్లు నమోదుచేశారు. వివిధ కోర్టులో చార్జ్షీట్లు నమోదయ్యాయి.