Maha Kumbh | మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh) ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కుంభమేళా నుంచి తిరిగి వస్తున్న యాత్రికుల బస్సు జబల్పూర్ (Jabalpur) జిల్లాలోని జాతీయ రహదారిపై ఓ ట్రక్కును బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం ఉదయం 8:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
జిల్లా కేంద్రానికి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిహోరా (Sihora) పట్టణానికి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మృతులు హైదరాబాద్ నాచారంకు చెందిన వారిగా గుర్తించారు. నాచారం నుంచి సుమారు 14 మంది ప్రయాణికులు మినీ బస్సులో కుంభమేళాకు వెళ్లారు. అక్కడ పుణ్యస్నానాల అనంతరం మంగళవారం ఉదయం తిరుగు పయణమయ్యారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ జబల్పూర్ శిరోహి ప్రాంతంలోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న బస్సు.. సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న ట్రక్కును బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు నాచారం రాఘవేంద్ర నగర్‌కు చెందిన నవీన్, బాలకృష్ణ, సంతోష్, శశికాంత్, రవి, ఆనంద్‌గా గుర్తించారు.
కాగా, మినీ బస్సు ఏపీ రిజిస్ట్రేషన్‌తో ఉండటంతో ప్రమాదం అనంతరం వీరంతా ఏపీకి చెందిన వారిగా పోలీసులు భావించారు. అయితే, ఘటనాస్థలిలో దొరికిన యాత్రికుల వివరాల ఆధారంగా వీరంతా నాచారం వాసులుగా తేల్చారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే జబల్పూర్ కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ట్రక్కు రాంగ్ సైడ్ నుంచి హైవేపై వెళ్తుండటంతో ప్రమాదానికి దారి తీసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న జబల్పూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read..
Maha Kumbh | మహాకుంభమేళాలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 43 కోట్ల మంది పుణ్యస్నానాలు
PM Modi: పారిస్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం.. డిన్నర్ ఇచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు
Ranveer Allahbadia: ఆ వివాదాస్పద వ్యాఖ్యల వీడియో యూట్యూబ్ నుంచి తొలగింపు