న్యూఢిల్లీ: యూట్యూబర్ రణ్వీర్ అల్లాబడియా(Ranveer Allahbadia) వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వీడియోను యూట్యూబ్ నుంచి తొలగించారు. ఇండియాస్ గాట్ లేటెంట్ ఎపిసోడ్లో రణ్వీర్ .. తల్లితండ్రులపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యల పట్ల దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతున్నది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ నుంచి నోటీసు అందిన తర్వాత యూట్యూబ్ ఆ వీడియోను డిలీట్ చేసింది. జాతీయ మానవ హక్కుల కమీషన్ సభ్యురాలు ప్రియాంక్ కనూంగ్ కూడా ఆ వీడియోను డిలీట్ చేయాలని డిమాండ్ చేశారు.
పోడ్కాస్టర్ రణ్వీర్కు ఇన్స్టాగ్రామ్లో 45 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. యూట్యూబ్లో కోటి మందికిపై సబ్స్క్రైబర్లు ఉన్నారు. బీర్బైసెప్స్ గయ్గా గుర్తింపు పొందని అల్లాబడియా షోలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆ షోకు చెందిన ఓ క్లిప్ ప్రస్తుతం వైరల్ అవుతున్నది. తల్లితండ్రుల శృంగారం గురించి ఓ కాంటెస్టెంట్ను తీవ్ర అభ్యంతరకరమైన ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్నపై సోషల్ మీడియాతో పాటు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అల్లాబడియాతో పాటు ఇండియాస్ గాట్ లేటెంట్ షోలో పాల్గొన్న ఇతర వ్యక్తులపై కూడా అస్సాంలో కేసు నమోదు చేశారు. ముంబైలోనూ పలు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు నమోదు అయ్యాయి.