గాంధీనగర్: మిథనాల్ కలిపిన కల్తీ మద్యం తాగి ఏడుగురు వ్యక్తులు మరణించారు. మరో 30 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. (spurious liquor) ఈ నేపథ్యంలో 12 మంది కల్తీ మద్యం వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు. 21 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యపాన నిషేధం అమలులో ఉన్న గుజరాత్లో ఈ సంఘటన జరిగింది. మంగళవారం సాయంత్రం భావనగర్ జిల్లాలోని ఒక గ్రామంలో మద్యం పార్టీ చేసుకున్న ఐదుగురు స్నేహితులు అస్వస్థతకు గురయ్యారు. పలు గ్రామాల ప్రజలతో పాటు భావ్‌నగర్ నగరంలోని పలు ప్రాంతాల వారు కూడా నకిలీ మద్యం కారణంగా ఆసుపత్రిపాలయ్యారు.
కాగా, మిథనాల్ కలిపిన కల్తీ మద్యం తాగి ఏడుగురు వ్యక్తులు మరణించగా, మరో 30 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, జిల్లా అధికారులు అలెర్ట్ అయ్యారు. మరణించిన, చికిత్స పొందుతున్న రోగుల నుంచి సేకరించిన రక్త నమూనాల్లో విషపూరితమైన మిథనాల్ ఆనవాళ్లు కనిపించాయి. ‘ఇండియన్-మేడ్ ఫారిన్ లిక్కర్’ పేరుతో విక్రయించిన కల్తీ మద్యంపై దర్యాప్తు చేశారు.
మరోవైపు మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన నరేంద్ర సింగ్ యాదవ్ అలియాస్ ‘డాక్టర్’ పర్యవేక్షణలో కల్తీ మద్యం వ్యాపారి గౌతమ్ సోలంకి ఇంట్లో విషపూరిత మద్యం తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు. సరస్, గణేష్, అమన్ అనే వ్యక్తులు మిథనాల్ కలిపిన మద్యం తయారీలో పాల్గొన్నట్లు దర్యాప్తులో బయటపడింది. నరేంద్ర సింగ్ యాదవ్ దానిని సేవించగా మరుసటి రోజు అతడి పరిస్థితి విషమించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో కల్తీ మద్యం తయారీ గుట్టురట్టయ్యింది.
ప్రధాన నిందితుడైన ఉజ్జయిన్‌కు చెందిన రయీస్, జుబేర్, గౌతమ్ సోలంకిలతో కలిసి ముడి పదార్థాలు తీసుకువచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురూ అహ్మదాబాద్‌లోని సర్ఖేజ్ నుంచి తెల్లటి ద్రవం, ఖాళీ సీసాలు, సీసా మూతలు, నకిలీ ‘రాయల్ స్టాగ్’ స్టిక్కర్లు, మిథనాల్ కొనుగోలు చేసి కల్తీ మద్యం తయారు చేశారు. విషపూరిత రసాయనాన్ని అసలైన మద్యంలా కనిపించేలా బాటిల్స్‌పై నకిలీ ‘రాయల్ స్టాగ్’ స్టిక్కర్లు అతికించారు.
అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్న కల్తీ మద్యం సీసాలలో 38.59 శాతం మిథనాల్, కేవలం 0.94 శాతం ఇథనాల్ ఉన్నట్లు గాంధీనగర్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) నివేదికలో తేలింది. దీంతో అది సాధారణ మద్యం కాదని, అత్యంత విషపూరితమైన మిథనాల్ ఆధారిత మిశ్రమమని నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో గుజరాత్, మధ్యప్రదేశ్‌కు చెందిన 12 మంది కల్తీ మద్యం వ్యాపారులను అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. 21 మంది నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.