న్యూఢిల్లీ: గౌతమ్ అదానీ కంపెనీల షేర్లు కుప్పకూలాయి. హిండెన్‌బర్గ్ నివేదికతో గ్రూపునకు చెందిన అన్ని సంస్థల షేర్లు 8 శాతం వరకు నష్టపోయాయి. ఒక దశలో 10 శాతానికి పైగా షేర్లు నష్టపోయాయి. అత్యధికంగా అదానీ ట్రాన్స్మిషన్ 8 శాతం పడిపోగా.. ఏసీసీ 7 శాతం, అంబుజా సిమెంట్ ఆరు శాతానికి పైగా నష్టపోయాయి. దీంతో గ్రూపు విలువ 10.8 బిలియన్ డాలర్లు (రూ.90 వేల కోట్లు) హారతి కర్పూరంలా కరిగిపోయింది. ఈ గ్రూపు సంస్థల్లో మెజార్టీ వాటాదారుడిగా ఉన్న గౌతమ్ అదానీ కూడా రూ.50 వేల కోట్ల వరకు నష్టపోయారు.
ప్రస్తుతం గౌతమ్ అదానీ 118 బిలియన్ డాలర్ల సంపదతో ఆసియా శ్రీమంతుడిగా వెలుగొందుతున్న విషయం తెలిసిందే. వ్యాపారాన్ని అన్ని రంగాలకు విస్తరించడానికి భారీగా నిధు లు సేకరించడానికి సమాయత్తమవుతున్న ప్రస్తుత తరుణంలో హిండెన్‌బర్గ్ గట్టి షాకిచ్చినట్లు అయింది. మరోవైపు, గడిచిన మూడేండ్లలో 3 వేల శాతానికి పైగా పెరిగిన షేర్లు ప్రస్తుతం కుప్పకూలాయి.