బెంగళూరు: కర్ణాటకలో మరోసారి కరానా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా చిక్కమగళూరులోని ఒక స్కూల్లో శనివారం 69 మందికి కరోనా సోకింది. ఇందులో 59 మంది విద్యార్థులు కాగా, 10 మంది సిబ్బంది ఉన్నారు. కరోనా బారిన పడిన విద్యార్థులకు ఎలాంటి లక్షణాలు లేవని చిక్కమగళూరు జిల్లా వైద్య అధికారి డాక్టర్ ఉమేష్ తెలిపారు. 457 నమూనాలు సేకరించగా 69 మందికి పాజిటివ్‌గా తేలిందని చెప్పారు. హోమ్ ఐసోలేషన్ ప్రోటోకాల్ ప్రకారం వారికి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆ స్కూల్‌ను ఏడు రోజులపాటు మూసివేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
మరోవైపు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో బృహన్ బెంగళూరు మహానగర పాలిక(బీబీఎంపీ) కీలక నిర్ణయం తీసుకున్నది. మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లు, థియేటర్లు, సినిమా హాళ్లలోకి ప్రవేశించడానికి రెండు డోసుల కరోనా టీకా తప్పనిసరి అని తెలిపింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే అధికారులు తనిఖీలు నిర్వహిస్తారని పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించే మాల్స్, థియేటర్ల నిర్వాహకులపై విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.