న్యూఢిల్లీ, జూలై 1: దేశంలో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ పలువురి బలవన్మరణాలకు కూడా కారణమైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఏమాత్రం తన వైఖరిని మార్చుకోవడం లేదు. ఇటీవలే నీట్ పేపర్ లీకేజీతో ఏకంగా పరీక్షనే రద్దుచేసి లక్షల మందిని ఇబ్బందులకు గురిచేసిన ఎన్టీఏ తాజాగా యూజీసీ-నెట్ పరీక్షలో అవే తప్పిదాలకు పాల్పడింది. ఇంగ్లిష్ పేపర్లో రెండేండ్ల నాటి ప్రశ్నపత్రం నుంచి దాదాపు సగం ప్రశ్నలను మళ్లీ ఇచ్చింది. మొత్తం 150 ప్రశ్నలకు గాను 67 ప్రశ్నలను మళ్లీ రిపీట్ చేసింది. సోషియాలజీ పేపర్లో అనేక తప్పిదాలు దొర్లినట్టు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పరీక్షల ప్రమాణాలు పూర్తిగా దిగజారాయని, ఇందుకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హతను నిర్ధారించేందుకు, పీహెచ్డీ చేసే వారి కోసం యూజీసీ-నెట్ పరీక్ష నిర్వహిస్తారు. ఇంగ్లిష్ పేపర్లో 2024లో నిర్వహించిన పరీక్ష ప్రశ్నపత్రం నుంచి 67 ప్రశ్నలను యథాతథంగా ఇచ్చారని అభ్యర్థులు తెలిపారు. ఈ పరీక్ష కోసం చదివేందుకు ఎంతో కష్టపడ్డామని కానీ ఇలా పాత ప్రశ్నలను మళ్లీ అడుగుతారని తెలిస్తే.. బట్టీ పట్టే వారమని వారు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ పద్ధతి కొన్ని కోచింగ్ సెంటర్లకు మేలు చేసేదిగా ఉన్నదని అంటున్నారు. తమ వద్ద కోచింగ్‌కు వచ్చే విద్యార్థులకు పాత ప్రశ్నపేపర్లతో ఈ సెంటర్లు ప్రాక్టీస్ చేయిస్తాయని, అవే ప్రశ్నలు పరీక్షలో వస్తే సదరు విద్యార్థులు సునాయాసంగా గట్టెక్కుతారని అభిప్రాయపడుతున్నారు.
ఇక సోషియాలజీ పేపర్ నిండా తప్పులేనంటూ పలువురు అభ్యర్థులు సోషల్ మీడియాలో వాటిని ఏకరువు పెట్టారు. అక్షర దోషాల కారణంగా పలు వాక్యాల భావం మారిపోయిందని, దీంతో ఏ జవాబు రాయాలో తెలియక తికమకపడ్డామని వారు వాపోయారు. పలువురు సోషియాలజిస్టులు, మేధావుల పేర్లను సైతం తప్పుగా పేర్కొన్నారని తెలిపారు. రిట్జర్ అనే పదాన్ని పుట్జర్ అని సోషల్ అనే పదాన్ని ఓవల్ అని, పార్సన్స్‌ను పార్సో అని, ఏఆర్ దేశాయ్‌ని ఏకే దేశాయ్ అని, నుస్బావుమ్ను నుస్బౌట్ అని పేర్కొన్నారని ప్రశ్నపత్రంలోని తప్పిదాలను ఎత్తిచూపారు. సోషియాలజీ పేపర్లో దాదాపు 50 శాతం ప్రశ్నలు తప్పులతో కూడుకొని ఉన్నాయని తెలిపారు. కొన్ని ప్రశ్నలకు హిందీ అనువాదం ఐదేండ్ల బాలుడు చేసినట్టుగా ఉందని మండిపడ్డారు. ప్రశ్నలకు జవాబు రాయడమేమో కానీ వాటిని అర్థం చేసుకోవడానికే తమకు సమయం సరిపోలేదని అంటున్నారు.
యూజీసీ-నెట్ పరీక్షలో తప్పులతో కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ మరోసారి ముందుకొచ్చింది. సామాజిక మాధ్యమాల వేదికగా పలువురు కేంద్ర మంత్రిని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. యూజీసీ-నెట్ సోషియాలజీ పేపర్ ఎన్టీఏ విద్యా ప్రమాణాలపై సందేహాలను లేవనెత్తుతున్నదని ఓ ఎక్స్ యూజర్ పేర్కొన్నారు. భారతదేశంలో విద్యా వ్యవస్థ వెంటిలేటర్‌పై ఉన్నదని మరో వ్యక్తి వ్యాఖ్యానించారు. ‘ఇది జోక్ అనిపిస్తున్నదా? ఈ ప్రశ్నపత్రం రూపొందించిన ప్రొఫెసర్లను పిలిచి.. వారినే జవాబులు రాయమని చెప్పండి. భారతీయ ఉన్నత విద్యను ముంచేయడానికి మీరు ఎంతకైనా దిగజారడానికి సిద్ధంగా ఉన్నారా? అంటూ మరొకరు ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇంగ్లిష్ పేపర్లో ఇచ్చిన మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల్లో 67 ప్రశ్నలకు ఇచ్చిన ఆప్షన్లు (జవాబులు) సైతం 2024 నాటి క్రమంలోనే ఉన్నాయని అన్నారు. ఏమాత్రం మార్పు లేకుండా మక్కీకి మక్కీ దించేశారని తెలిపారు. ప్రశ్నలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎన్టీఏదేనని, ఈ అసాధారణ పరిస్థితికి కూడా ఎన్టీఏనే కారణమని పలువురు విద్యావేత్తలు విమర్శించారు. ఈ ప్రశ్నపత్రాలను బోగస్ నిపుణులు రూపొందించి ఉంటారని, అందుకే పాత ప్రశ్నపత్రంలోని ప్రశ్నలనే మళ్లీ ఇచ్చారని పేర్కొన్నారు. సాధారణంగా ఐదు నుంచి పదేండ్ల తరువాత ఒకటి లేదా రెండు పాత ప్రశ్నలు చాలా అరుదుగా వస్తుంటాయని, కానీ ఇలా 67 ప్రశ్నలను రిపీట్ చేయడమంటే ప్రశ్నపత్రాన్ని లీక్ చేయడమేనని గురుజాంబేశ్వర్ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఆర్కే చౌహాన్ వ్యాఖ్యానించారు.