Zika virus | మహారాష్ట్రలోని పూణె (Pune)లో జికా వైరస్ (Zika Virus) కలకలం సృష్టిస్తోంది. గత కొన్ని రోజులుగా పుణెలో భారీగా ఈ వైరస్ కేసులు బయటపడుతున్నాయి. జూన్ నుంచి ఇప్పటి వరకూ దాదాపు 66 జికా వైరస్ కేసులు నమోదైనట్లు అధికారులు మంగళవారం తెలిపారు. అందులో 26 మంది గర్భిణిలు కూడా (Pregnant Women) ఉన్నట్లు పేర్కొన్నారు.
‘జూన్ నుంచి ఇప్పటి వరకూ పుణె నగరంలో 66 జికా వైరస్ కేసులు బయటపడ్డాయి (66 Zika Virus Cases Reported ). అందులో 26 మంది గర్భిణిలు కూడా ఉన్నారు. పాజిటివ్ తేలిన వారిలో 68 ఏళ్ల నుంచి 78 మధ్య వయస్సు గల నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, వారి మరణాలకు జికా వైరస్ కారణం కాదని తేలింది. ఇతర ఆరోగ్య కారణాలతోనే వారి మరణాలు నమోదయ్యాయి’ అని అధికారులు తెలిపారు. ఇక వైరస్ బారిన పడిన గర్భిణి స్త్రీల ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అదృష్టవశాత్తూ వారిలో చాలా మంది ఆరోగ్యంతో ఉన్నట్లు తెలిపారు. ఇక, పుణెలో జికా వైరస్ మొదటి కేసు ఈ ఏడాది జూన్ 20న నమోదైంది. అరంద్వానేలో 46 ఏండ్ల డాక్టర్ తొలుత జికా వైరస్ బారిపడ్డారు. అనంతరం అతని కుమార్తె (15)కు వైరస్ సోకినట్లు వైద్య పరీక్షల్లో తేలింది.
కాగా, జికా వైరస్ సోకిన ఆడ ఎడిస్ దోమ కుట్టడం వల్ల వ్యాధి సంక్రమిస్తుంది. ఈ వైరస్‌ను తొలిసారి 1947లో ఉగాండా అడవుల్లోని ఓ కోతిలో గుర్తించారు. ఆ తర్వాత ఆఫ్రికన్ దేశాలతోసహా భారత్, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, వియత్నాం లాంటి ఆసియా దేశాలకూ ఈ వ్యాధి వ్యాప్తి చెందింది. ఈ వైరస్ సోకినవారిలో జ్వరం, చర్మంపై దద్దుర్లు, కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, జీర్ణకోశ సంబంధ సమస్యలు, గొంతు నొప్పి, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
Also Read..
Sheikh Hasina | బంగ్లాదేశ్‌లో హింసాకాండ.. హసీనా పార్టీకి చెందిన 29 మంది డెడ్‌బాడీస్ లభ్యం
Manu Bhaker | స్వదేశానికి చేరుకున్న మను బాకర్.. ఢిల్లీలో ఘన స్వాగతం
Reverse Gear: రివర్స్ గేర్‌లో డ్రైవర్‌లేకుండానే దూసుకెళ్లిన ట్రక్కు.. వీడియో