(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly Elections) అధికార ఎన్డీయే (NDA)కూటమికి ఓటర్లు షాక్ ఇవ్వనున్నారా? ఐదేండ్ల పాలనలో అభివృద్ధికి ఏమాత్రం నోచుకోని ప్రజలు.. ఈసారి తమ ఓటుతో బీజేపీ, దాని మిత్ర పక్షాలకు బుద్ధి చెప్పనున్నారా? గురువారం జరిగిన తొలి దఫా పోలింగ్ సరళిని విశ్లేషిస్తే, బీజేపీకి బీహారీల షాక్ తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి కారణం.. బీహార్ రాష్ట్ర చరిత్రలో ఇంతవరకూ ఎన్నడూ చూడని స్థాయిలో పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలోని 18 జిల్లాల పరిధిలోని 121 నియోజకవర్గాల్లో గురువారం తొలి దఫా ఎన్నికలు జరగ్గా.. ఏకంగా 64.66 శాతం పోలింగ్ నమోదైంది. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలి దఫాలో 56.2 శాతం పోలింగ్ నమోదైంది. ఇప్పుడు దానితో పోలిస్తే ఏకంగా 8.46 శాతం అధిక పోలింగ్ రికార్డుకావడం గమనార్హం.
ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగితే, అది ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమని నిపుణుల అభిప్రాయం. బీహార్లో తొలి దఫా పోలింగ్ జరిగిన 121 నియోజకవర్గాల్లో 59 సీట్లు ఎన్డీయే కూటమికి చెందినవే. మిగతా స్థానాలు ప్రతిపక్ష పార్టీలు, స్వతంత్రుల ఖాతాలో ఉన్నాయి. ఈ లెక్కన ప్రభుత్వ వ్యతిరేకత వంద శాతం ఉండటం వల్లే తొలి దఫాలో 64.66 శాతం రికార్డు పోలింగ్ నమోదైనట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ నేతృత్వంలోని నితీశ్ పాలనలో రాష్ట్రంలో నిరుద్యోగం పెచ్చరిల్లిపోయింది. ఉపాధి అవకాశాలు లేకపోవడంతో బీహార్ యువత ఇతర రాష్ర్టాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి. ఇక, ప్రభుత్వంలో నెలకొన్న అవినీతి, సీఎం పదవి కోసం యూటర్న్లకు అలవాటుపడ్డ నితీశ్ వైఖరి, కేంద్రంలో మోదీ ప్రభుత్వ వైఫల్యాలు.. వెరసి బీహార్లోని అధికార ఎన్డీయే కూటమికి ఈ ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పనున్నట్టు విశ్లేషకులు చెప్తున్నారు. తొలి దఫాలో నమోదైన రికార్డు పోలింగ్ దీనికి ఒక రుజువుగా అభిప్రాయపడుతున్నారు.
ఓటర్ల జాబితాల రిగ్గింగ్, అక్రమాలు జరిగాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్)ను దేశంలో మొదటిసారి నిర్వహించిన తర్వాత జరుగుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈసీ పారదర్శకతను, నిజాయితీకి పరీక్షగా నిలవనున్నాయి. రెండవ విడత పోలింగ్ నవంబర్ 11న 122 నియోజకవర్గాలలో జరగనున్నది. తొలి దశ బరిలో ఆర్జేడీకి చెందిన తేజస్వీ యాదవ్, ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి ఉన్నారు.