జైపూర్: రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లో ఉన్న రాంపుర కన్వాపుర గ్రామంలో ప్రభుత్వ స్కూల్‌ను సీజేపీ బృందం పరిశీలించేందుకు శుక్రవారం వెళ్లగా వారిపై దాడి జరిగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ స్కూల్‌ను పరామర్శించడానికి సీజేపీ వెళ్తుంటే దాడి చేయడం ఏంటని తీవ్ర విమర్శలు రావడంతో అధికారులు విద్యార్థులను శనివారం వేరే బిల్డింగ్‌లోకి తరలించారు. మరోవైపు రాజస్థాన్‌లో ఏకంగా 611 ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవనాలు లేవని ఆ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం అసెంబ్లీలో తెలిపింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది.
రాజస్థాన్‌లో 2,047 పాఠశాలల్లో ఇప్పటికీ సరైన మరుగుదొడ్లు లేవని ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో వెల్లడైనది. సీజేపీ పర్యటనలపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో పాఠశాలల రిపేర్లకు రూ.550 కోట్లు కేటాయిస్తున్నామని, రూ.450 కోట్లు కొత్త బిల్డింగుల కోసం ఖర్చు చేస్తున్నట్టు తెలిపింది. తమ మీద కన్వాపురలో జరిగిన దాడిపై రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి 48 గంటల్లో నిష్పక్ష పాతంగా విచారణ జరపాలని సీజేపీ డిమాండ్ చేసింది. ఇంకోవైపు అనుమతి లేకుండా ఒక ప్రభుత్వ బడిలోకి ప్రవేశించి, టీచర్ల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు వారిని బెదిరించారనే ఆరోపణలపై సీజేపీ కన్వీనర్ అభిజీత్ దీప్కే, ఇతరులపై లాతూర్ జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు.