Panchkula | హర్యానా (Haryana)లో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులంతా కారులోనే విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన పంచకుల జిల్లాలోని సెక్టార్ 27లో చోటు చేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డెహ్రాడూన్ (Dehradun) నివాసులైన ప్రవీణ్ మిట్టల్ కుటుంబం పంచకుల (Panchkula)లోని బాగేశ్వర్ ధామ్ (Bageshwar Dham)లో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరయ్యేందుకు హర్యానాకు వచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న వారంతా సోమవారం రాత్రి సొంతూరుకి తిరుగు పయనమయ్యారు. అయితే, వారు తమ కారును ఓ చోట ఆపి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న కొందరు రోడ్డు పక్కన మహారాష్ట్ర నంబర్ ప్లేట్తో ఉన్న కారును గుర్తించారు. అది అనుమానాస్పదంగా అనిపించడంతో వెళ్లి చూడగా.. అందులోని వారంతా అపస్మారక స్థితిలో కనిపించారు.
వెంటనే కారు అద్దాలను ధ్వంసం చేసి ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. కారులో ఆరుగురు చనిపోగా.. మరో వ్యక్తి కారు బయట కూర్చొని మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆ కుటుంబం బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Also Read..