husband murders and suicides | గత ఆరు నెలల్లో.. 554 మంది భర్తల హత్యలు, ఆత్మహత్యలు
husband murders and suicides | గత ఆరు నెలల్లో సుమారు 554 మంది భర్తలు హత్యకు గురికావడంతో పాటు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దేశంలో ప్రతిరోజూ సగటున ఇద్దరు భర్తలు హత్యకు గురికాగా, ఒకరి కంటే ఎక్కువ మంది భర్తలు ఆత్మహత్య చేసుకున్నారు.
న్యూఢిల్లీ: గత ఆరు నెలల్లో సుమారు 554 మంది భర్తలు హత్యకు గురికావడంతో పాటు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దేశంలో ప్రతిరోజూ సగటున ఇద్దరు భర్తలు హత్యకు గురికాగా, ఒకరి కంటే ఎక్కువ మంది భర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. (husband murders and suicides) గురుగ్రామ్‌కు చెందిన ‘ఏకం న్యాయ్ ఫౌండేషన్’ దీనికి సంబంధించి ఒక నివేదిక విడుదల చేసింది. 2026 జనవరి నుంచి జూలై 14 వరకు మీడియాలో వచ్చిన వార్తలు, ఆ సంస్థ సేకరించిన వివరాల ఆధారంగా ఒక రిపోర్ట్‌ను తయారు చేసింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా భర్తల హత్యలు, ఆత్మహత్యలకు సంబంధించిన 554 సంఘటనలను తాము నమోదు చేసినట్లు ఆ సంస్థ పేర్కొంది. వివాహేతర సంబంధాలు, వైవాహిక వివాదాలు ప్రధాన కారణమని పేర్కొంది.
కాగా, ఈ నివేదిక ప్రకారం భార్యలు లేదా వారి ప్రియుల చేతిలో భర్తలు హత్యకు గురైన 322 సంఘటనలు జరిగాయి. అలాగే వైవాహిక వివాదాలు, గృహ హింస, వేధింపులు, తప్పుడు క్రిమినల్ కేసులు, ఇతర సమస్యల కారణంగా భర్తలు ఆత్మహత్య చేసుకున్న 232 ఘటనలను ఆ సంస్థ నమోదు చేసింది. 2026 మొదటి ఆరు నెలల్లో భారతదేశంలో ప్రతిరోజూ సగటున ఇద్దరు భర్తలు హత్యకు గురయ్యారని, ఒకరి కంటే ఎక్కువ మంది భర్తలు ఆత్మహత్య చేసుకున్నట్లు ఈ గణాంకాలు సూచిస్తున్నాయని ఆ ఫౌండేషన్ తెలిపింది.
అయితే ఈ కేసుల సంఖ్యలు కేవలం మీడియా నివేదికల ఆధారంగా తాము సేకరించినవేనని, అధికారిక ప్రభుత్వ గణాంకాలు కాదని ఆ సంస్థ స్పష్టం చేసింది. అనేక సంఘటనలు మీడియా దృష్టికి రాలేదని, అలాగే భర్తల హత్యలు లేదా గృహ హింసకు గురైన పురుషుల వివరాలను నమోదు చేసే అధికారిక జాతీయ డేటాబేస్ ఏదీ లేకపోవడంతో వాస్తవ సంఘటనల సంఖ్య దీనికంటే చాలా ఎక్కువగా ఉండవచ్చని పేర్కొంది.
మరోవైపు భర్తల హత్యలకు ప్రధాన కారణం వివాహేతర సంబంధాలేనని ఈ నివేదిక గుర్తించింది. నమోదు చేసిన 322 హత్య కేసుల్లో 194 (సుమారు 60.2 శాతం) ఘటనలకు ఇదే కారణమని తేలింది. వివాహేతర సంబంధాన్ని భర్తలు వ్యతిరేకించినప్పుడు లేదా అడ్డుకున్నందుకు భార్యలు తమ ప్రియులతో కలిసి భర్తలను చంపడానికి కుట్ర పన్నిన ఆరోపణలు అనేక కేసుల్లో ఉన్నాయని ఆ ఫౌండేషన్ తెలిపింది.
కాగా, భర్తలు చేసుకున్న 232 ఆత్మహత్యలను కూడా ఈ నివేదిక ప్రస్తావించింది. వీటిలో 104 కేసులు (44.83 శాతం) దీర్ఘకాలిక గృహ వివాదాలే ప్రధాన కారణమని గుర్తించింది. మరో 57 కేసులు (24.57 శాతం) భార్యలు లేదా అత్తమామల వేధింపుల ఆరోపణలు కారమని ఆరోపించింది. 29 కేసులు (12.5 శాతం) వివాహేతర సంబంధాలతో ముడిపడి ఉన్నట్లు పేర్కొంది. తప్పుడు క్రిమినల్ ఆరోపణలు, ప్రియురాళ్లు లేదా వారి కుటుంబాల వేధింపులు, ఇతర అంశాలు వంటివి మిగిలిన కేసులని వివరించింది.
అయితే ఈ నివేదిక ప్రకారం గత ఆరు నెలల్లో ఉత్తర ప్రదేశ్‌లో అత్యధికంగా 93 మంది భర్తల హత్యలు, 103 మంది భర్తల ఆత్మహత్యలు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా, బీహార్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలు కూడా అధిక సంఖ్యలో నమోదైన కేసుల జాబితాలో ఉన్నాయి. ఈ సంవత్సరం నమోదైన అత్యంత దారుణమైన 25 కేసులను ఫౌండేషన్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. వీటిలో భర్తల తల నరకడం, శరీరాన్ని ముక్కలుగా నరకడం, విషప్రయోగం, ఇంటి నేల కింద పాతిపెట్టడం, సజీవంగా దహనం చేయడం, లోతైన లోయల్లోకి తోసేయడం, భార్యలు లేదా వారి ప్రియుల కుట్రలతో హత్యలు చేయడం వంటి ఘటనలు ఉన్నాయని తెలిపింది.
ఇక భర్తల ఆత్మహత్య కేసులలో అనేక మంది బాధితులు వివరణాత్మక సూసైడ్ నోట్లు లేదా వీడియోలు రికార్డ్ చేశారని ఈ నివేదిక పేర్కొంది. దీర్ఘకాలిక వేధింపులు, గృహ హింస, తప్పుడు క్రిమినల్ కేసులు, తమ పిల్లలను కలుసుకోనివ్వకపోవడం లేదా నిరంతర మానసిక క్రూరత్వం వంటి కారణాల వల్ల భర్తలు ఆత్మహత్యలకు పాల్పడినట్లు వివరించింది.
కాగా, దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కేతన్ అగర్వాల్ హత్య కేసును ‘ఏకం న్యాయ్ ఫౌండేషన్’ వ్యవస్థాపకురాలు దీపికా నారాయణ్ భరద్వాజ్ ప్రధానంగా ప్రస్తావించారు. అతడి కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ కలసి లోయలోకి తోసి హత్య చేయడం వంటి దారుణాలు దేశంలో ప్రతిరోజూ నమోదవుతున్నాయని తెలిపారు. అయితే భర్తల హత్యలు, గృహ హింసకు గురైన పురుష బాధితుల కోసం అధికారిక నేర గణాంకాలలో ప్రత్యేక వర్గీకరణ లేకపోవడం వల్ల ఈ సమస్య వాస్తవ తీవ్రతను అంచనా వేయడం కష్టమవుతోందని ఆమె అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

