West Bengal : పశ్చిమ బెంగాల్లో అధికారం కోల్పోయిన టీఎంసీకి కోలుకోలేని దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు కిందిస్తాయి నేతలు పార్టీని వీడుతుండగా.. ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు టీఎంసీకి గుడ్‌బై చెప్పేందుకు రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని బెంగాల్‌కు చెందిన బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్ వెల్లడించారు. టీఎంసీకి చెందిన 50 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు పార్టీని వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సౌమిత్రా ఖాన్ ప్రకటించారు.
వీరంతా టీఎంసీ పార్టీపై అసంతృప్తితో ఉన్నారని, ఆ విషయాన్ని బీజేపీ నేతలకు చెప్పారని సౌమిత్రా అన్నారు. బీజేపీలో చేరేందుకు పార్టీ పెద్దల ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి ఆమోదం లభిస్తే, టీఎంసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారని, దీంతో టీఎంసీ రాష్ట్రం నుంచి తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని సౌమిత్రా ఖాన్ వ్యాఖ్యానించారు. అయితే, సౌమిత్రా ఖాన్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని టీఎంసీ అంటోంది. పార్టీ నేతలు బీజేపీలో చేరుతారంటూ సౌమిత్రా ఖాన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ మాట్లాడుతూ తప్పుడు ప్రచారం ద్వారా లభ్ధి పొందాలని కాషాయ పార్టీ చూస్తోందన్నారు.
ఉద్దేశపూర్వకంగానే బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, తమ నేతలెవరూ పార్టీని వీడే అవకాశం లేదన్నారు. తాజాగా అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం టీఎంసీ నేతలపై అవినీతి కేసులు పెడుతోంది. చాలా మంది ఈ కేసులకు భయపడి బీజేపీవైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీఎంసీ నేతలపై ఈడీ దాడులు నిర్వహిస్తోంది. మాజీ మంత్రి సుజిత్ బోస్‌ను ఇటీవల ఈడీ అరెస్టు చేసింది. తాజాగా టీఎంసీకి చెందిన 100 మంది కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇతర పెద్ద నేతలు కూడా రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా నేతలు వరుసగా పార్టీని వీడితో టీఎంసీ మళ్లీ కోలుకోవడం అంత సులభం కాదు.