POCSO Act | బెంగళూరు, సెప్టెంబర్ 14: పోక్సో కింద కేసు పెట్టారన్న కక్షతో ఓ గ్రామంలోని అగ్ర వర్ణాల వారు..అక్కడి దళితులందరిపైనా సామాజిక బహిష్కరణ విధించారు. కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా హునాసాగి తాలూకాలోని ఓ గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. తమను సామాజికంగాబహిష్కరించారని గ్రామంలోని దళితులు పోలీసు ఉన్నతాధికారుల ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో గ్రామంలో ఇరు వర్గాలకు చెందినవాళ్లతో పోలీసులు సమావేశమయ్యారు.
ఓ బీద దళిత కుటుంబానికి చెందిన 15 ఏండ్ల బాలిక గర్భం దాల్చటంతో, బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. యువతిని మోసం చేసిన వ్యక్తి గ్రామంలో అగ్ర వర్ణానికి చెందినవాడని తేలింది. నారాయణ్‌పూర్ పోలీస్ స్టేషన్లో నిందితుడిపై పోక్సో కింద కేసు నమోదైంది. దీనికి ప్రతీకారంగా.. గురువారం రాత్రి నుంచి దళితుల్ని సామాజికంగా బహిష్కరించినట్టు పోలీసుల విచారణలో తేలింది.