రేప్‌ను ఎంజాయ్ చేయాలంటూ కర్ణాటక అసెంబ్లీలో కామెంట్ చేసిన మాజీ స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. కేఆర్ రమేశ్ కుమార్ వ్యాఖ్యలను పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖ మహిళలు తప్పుబట్టారు. ఈ క్రమంలో తాను చేసిన వ్యాఖ్యల పట్ల రమేశ్ కుమార్ ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పారు. రేప్ గురించి నిర్లక్ష్యపూరిత, అసంబద్ధమైన వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు. చాలా హేయమైన ఆ నేరం గురించి తానేమీ నవ్వులాటగా మాట్లాడలేదని, అనాలోచితంగా వ్యాఖ్యలు చేసినట్లు ఆయన అన్నారు. ఇక నుంచి తాను జాగ్రత్తగా మాట్లాడనున్నట్లు రమేశ్ కుమార్ తెలిపారు.
లైంగికదాడి అనివార్యమైనప్పుడు దాన్ని ఎంజాయ్ చేయాలంటూ రమేశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. శాసనసభలో ఈ వ్యాఖ్యలను ఖండించకుండా స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కగేరి పగలబడి నవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతు సమస్యలపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని కోరుతూ బుధవారం అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను డిమాండ్ చేస్తున్న సమయంలో స్పీకర్‌ను ఉద్దేశించి రమేశ్‌కుమార్ పైవ్యాఖ్య చేశారు. ‘ఒక సామెత ఉంది. లైంగికదాడి అనివార్యమైనప్పుడు, పడుకొని ఎంజాయ్ చేయాలి. మీరు ఉన్న స్థితి కూడా సరిగ్గా అదే’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై అసెంబ్లీలోని ఏ ఒక్క సభ్యుడు కూడా అభ్యంతరం చెప్పలేదు.
ఇదిలా ఉంటే.. గతంలోనూ ములాయం సింగ్ యాదవ్, మమతా బెనర్జీ, ఓం ప్రకాశ్ చౌతాలా, తపాస్ పాల్, బాబులాల్ గౌర్ కూడా రేప్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
2014లో ఓ కార్యక్రమంలో ములాయం సింగ్ యాదవ్ మాట్లాడుతూ.. రేప్ చేసిన వారి పట్ల డెత్ పెనాల్టీ విధించడం సరికాదన్నారు. మొదట బాలికలు అబ్బాయిలతో స్నేహంగా ఉంటారు. కొంతకాలానికి విబేధాలు వస్తాయి. అంతా మాత్రాన రేప్ చేశారంటే ఎలా? రేప్ చేస్తే ఉరేస్తారా? అని ములాయం ప్రశ్నించారు.
అమ్మాయిలు, అబ్బాయిలు ఫ్రీగా ఉండటం వల్లే రేప్‌లు జరుగుతున్నాయని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ 2012లో కామెంట్ చేశారు. ఈ సత్సంబంధాల వల్లే అత్యాచారాలు పెరుగుతున్నాయన్నారు. అమ్మాయి, అబ్బాయి కలిసి ఉంటే పూర్వంలో మన తల్లిదండ్రులు మందలించేవారు. కానీ ఇప్పుడు అలా లేదు అని మమత వ్యాఖ్యానించారు.
అమ్మాయిలకు, అబ్బాయిలకు 16 ఏండ్లకే పెళ్లిళ్లు అయితే రేప్‌లకు ఆస్కారం లేదని హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతలా 2012లో వ్యాఖ్యానించారు. వివాహాలకు కనీస వయసు 16 ఏండ్లు నిర్ధారించినప్పుడు రేప్‌లను అరికట్టొచ్చన్నారు.
నటుడు, తృణమూల్ కాంగ్రెస్ లీడర్ తపాస్ పాల్ కూడా లైంగికదాడులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీఎంసీ కార్యకర్తలను ప్రత్యర్థులు టచ్ చేస్తే వారి భార్యలు, సోదరీమణులపై రేప్‌లు చేయమని తమ కార్యకర్తలను ఆదేశిస్తానని 2014లో పాల్ అన్నారు.
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బాబులాల్ గౌర్ రేప్‌ను సామాజిక నేరంగా అభివర్ణించారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తేనే అత్యాచారం నేరంగా పరిగణించబడుతుందని గౌర్ చెప్పారు. అత్యాచారం అనేది పురుషులు, స్త్రీలపై ఆధారపడిన విషయమన్నారు. కొన్ని సార్లు ఇది సరైనదే. కొన్ని సార్లు తప్పు అని గౌర్ పేర్కొన్నారు.