కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు సమ్మె సైరన్ మోగించారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం మే 22 నుంచి మూడు రోజుల పాటు సమ్మెకు దిగుతామని పేర్కొన్నారు. (private bus operators strike) ఆ రాష్ట్రంలోని ఐదు ప్రైవేట్ బస్సు ఆపరేటర్ల సంఘాలు ఈ మేరకు శుక్రవారం ప్రకటించాయి. సీఎం మమతా బెనర్జీకి లేఖ రాశాయి. సమ్మె చేపట్టక ముందే తమతో చర్చలు జరుపాలని ప్రైవేట్ బస్సు ఆపరేటర్ల సంస్థలు ప్రభుత్వాన్ని కోరాయి.
కాగా, కరోనా లాక్డౌన్ సమయంలో జరిగిన నష్టాల నుంచి ఇంకా కోలుకోలేదని ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు తెలిపారు. మనుగడ కోసం పోరాడుతున్న స్టేజ్ క్యారేజ్ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఆచరణీయ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించలేదని ఆరోపించారు. 15 ఏళ్ల పాత బస్సుల వినియోగాన్ని రెండేళ్లు పొడిగించాలని కోరారు.
మరోవైపు ట్రాఫిక్ ఉల్లంఘనలపై పోలీసుల అతిక్రమణలను నియంత్రించాలని, టోల్ ట్యాక్స్‌లను తగ్గించాలని, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు డిమాండ్ చేశారు. ప్రభుత్వం చర్చలు జరుపకుండా ప్రతిష్టంభన కొనసాగిస్తే మే 22 నుంచి 25 వరకు సమ్మె తర్వాత కూడా నిరసన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
కాగా, పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా, పరిసర ప్రాంతాల్లో సుమారు 2,500 ప్రైవేట్ బస్సులు నడుస్తుండగా, ఆ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 27,000 బస్సులు తిరుగుతున్నాయి.