గువాహటి: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తనకు గిట్టని పార్టీలను చీల్చడమే పనిగా పెట్టుకున్నది. మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేనను చీల్చి మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని విజయవంతంగా కూల్చిన విషయం తెలిసిందే. ఏకంగా ఉద్ధవ్ థాక్రేను పార్టీ నుంచి దూరం చేయడానికి జోరుగా ప్రయత్నాలు చేస్తున్నది.
ఇక ఇన్నాళ్లు తమతో కలిసి బీహార్‌లో ప్రభుత్వాన్ని నడిపిన సీఎం నితీశ్ కుమార్.. ప్రతిపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో చేతులు కలిపారు. మహాఘట్బంధన్ కూటమి నేతృత్వంలో కొత్త సర్కారును ఏర్పాటు చేశారు. ఇప్పుడు తమను కాదని ప్రతిపక్షాలతో కలిసిన జేడీయూను ఉనికిలో లేకుండా చేసే ప్రయత్నాలను కమలం పార్టీ ప్రారంభించింది. అయితే ఆ ప్రక్రియను మణిపూర్‌నుంచి షురూ చేసింది.
గత మార్చిలో జరిగిన మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ కలిసి పోటీచేశాయి. 38 ఎమ్మెల్యే సీట్లున్న మణిపూర్‌లో జేడీయూ నుంచి ఆరుగురు విజయం సాధించారు. వారిలో ఐదుగురు పార్టీ అధిష్ఠానంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి… బీజేపీలో చేరారు. తమ పార్టీని బీజేపీలో కలిపేస్తున్నామని ఐదుగురు ఎమ్మెల్యేలు స్పీకర్‌కు తెలిపారు. దానిని స్పీకర్ ఆమోదించినట్లు అసెంబ్లీ కార్యదర్శి మేఘజిత్ సింగ్ ప్రకటించారు.