లక్నో: ఒక ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఇద్దరు పిల్లలు సహా ఐదుగురు మరణించారు. మహిళ, చిన్నారి గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. (House Catches Fire) బెహతా హాజీపూర్ గ్రామంలోని ఓ ఇంట్లో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లోని ఇంట్లో మంటలు చెలరేగాయి. బిల్డింగ్ మొదటి, రెండో అంతస్తుకు అవి వ్యాపించాయి. దీంతో ఆ అంతస్తుల్లోని నివాసితులు మంటలు, పొగల్లో చిక్కుకున్నారు.
కాగా, అర్ధరాత్రి వేళ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు. ఆ బిల్డింగ్ నివాసితులను కాపాడారు. అగ్నిప్రమాదం జరిగిన ఇంట్లో ఐదుగురు మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఏడు నెలల శిశువు, ఏడేళ్ల బాలిక, వృద్ధులు, పెద్దలు మృతుల్లో ఉన్నట్లు చెప్పారు. గాయపడిన మహిళ, చిన్నారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు వివరించారు. అగ్నిప్రమాదానికి కారణంపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.