Covid-19 | కరోనా మహమ్మారి మళ్లీ కలకలం సృష్టిస్తున్నది. గత కొద్ది నెలలుగా స్తబ్దుగా ఉన్న వైరస్ మళ్లీ రూపం మార్చుకొని విరుచుకుపడుతున్నది. గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో కేసులు నమోదయ్యాయి. తాజాగా చండీగఢ్‌లో కరోనా వైరస్‌తో ఓ వ్యక్తి మృతి చెందాడు. చండీగఢ్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోని సెక్టార్-32లో బుధవారం 40 సంవత్సరాల వ్యక్తి కొవిడ్ బారినపడి చనిపోయాడని ఓ అధికారి తెలిపారు. జీఎంసీహెచ్ మెడికల్ సూపరింటెండెంట్ జీపీ థామి ధ్రువీకరించారు. రోగిని లూథియానా నుంచి రిఫర్ చేశారని.. రెండురోజుల కిందట శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రిలో చేరాడని.. మంగళవారం పరీక్షలు చేయగా కొవిడ్ పాజిటివ్‌గా తేలిందన్నారు. బుధవారం సదరు వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు.
కొవిడ్ నేపథ్యంలో ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సదరు రోగి మంగళవారం ఆసుపత్రిలో చేరాడని.. అతనికి కొవిడ్ సోకినట్లుగా నిర్ధారణ అయ్యిందని.. బుధవారం తెల్లవారు జామున పరిస్థితి విషమించి ఉదయం 4 గంటలకు మరణించినట్లు పేర్కొన్నారు. మృతుడి స్వస్థలం యూపీలోని ఫిరోజాబాద్ అని పేర్కొన్నారు. కొంతకాలంగా శ్వాసకోశ సమస్య, జ్వరంతో బాధపడుతున్నాడని పేర్కొన్నారు. కొవిడ్‌తో మరికొందరు ఇక్కడికి వస్తారని అనుమానం వ్యక్తం చేశారు. అయితే, సదరు వ్యక్తికి సోకిన వేరియంట్ గుర్తించి ఇంకా ఏమీ తెలియలేదని సూపరింటెండెంట్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. భారత్‌లో సోమవారం వెయ్యికిపైగా యాక్టివ్ కొవిడ్ కేసులు ఉన్నట్లుగా కేంద్ర రోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. అత్యధికంగా యాక్టివ్ కేసులు కేరళలో 430 ఉండగా.. మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, కర్నాటకలో అత్యధికంగా ఉన్నాయి.