లక్నో: ప్రైవేట్ స్కూల్ బిల్డింగ్ పాక్షికంగా కూలింది. పిట్ట గోడ కూలడంతో సుమారు 40 మంది విద్యార్థులు గాయపడ్డారు. (Balcony collapses in private school) వారిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నలుగురు పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని బారాబంకి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అవధ్ అకాడమీ ప్రైవేట్ స్కూల్లో ఉదయం అసెంబ్లీ సమయంలో పలువురు విద్యార్థులు మొదటి అంతస్తులోని పిట్టగోడ వద్ద గుమిగూడారు. అది బలహీనంగా ఉండటంతో కూలిపోయింది.
కాగా, బాల్కానీ కూలిన శిథిలాల నుంచి విద్యార్థులను బయటకు తీశారు. గాయపడిన సుమారు 40 మంది పిల్లలను తొలుత జహంగీరాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పిల్లలను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఆ హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు. నలుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.