అహ్మదాబాద్: జూనియర్ మెడికల్ స్టూడెంట్స్ను సీనియర్లు కిడ్నాప్ చేశారు. వారిని తిట్టడంతోపాటు కొట్టారు. జూనియర్ల ఫిర్యాదుపై మెడికాల్ కాలేజీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. నలుగురు సీనియర్ మెడికల్ స్టూడెంట్స్ను సస్పెండ్ చేసింది. (medical students suspended) గుజరాత్లోని భావ్నగర్లో ఈ సంఘటన జరిగింది. మార్చి 7న ప్రభుత్వ వైద్య కాలేజీలో 2019 బ్యాచ్ స్నాతకోత్సవం జరిగింది. ఈ సందర్భంగా జూనియర్, సీనియర్ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది.
కాగా, ముగ్గురు జూనియర్ మెడికల్ స్టూడెంట్స్ను నలుగురు సీనియర్ విద్యార్థులు ఒక చోటుకు రప్పించారు. వారిని బలవంతంగా కారులోకి ఎక్కించారు. కారు నడుపుతూ జూనియర్లను తిట్టడంతోపాటు కొట్టారు. వారిని బెదిరించారు.
మరోవైపు ముగ్గురు జూనియర్ మెడికోలు ఈ సంఘటనపై పోలీసులతోపాటు కాలేజీ యాంటీ ర్యాగింగ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. దీంతో 11 మంది సభ్యుల కమిటీ వారి ఫిర్యాదును పరిశీలించింది. జూనియర్ మెడికల్ విద్యార్థులను అసభ్యకరంగా తిట్టి కొట్టిన సీనియర్ల చర్యను ర్యాగింగ్గా పరిగణించింది.
కాగా, పీజీ డాక్టర్లైన మిలన్, పియూష్, మాన్, నరేన్ను శనివారం సస్పెండ్ చేసినట్లు ప్రభుత్వ మెడికల్ కాలేజీ డీన్ డాక్టర్ సుశీల్ కుమార్ ఝా తెలిపారు. వారి సర్టిఫికెట్లను నిలిపివేయాలని కమిటీ నిర్ణయించినట్లు వెల్లడించారు.