చెన్నై: ఒక యువకుడి కస్టడీ డెత్ కేసులో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నలుగురు పోలీసులకు 11 ఏళ్లు జైలు శిక్ష విధించింది. (Jail For Cops) కేసును తప్పుదోవ పట్టించిన మరికొందరు పోలీస్ అధికారులు, సాక్ష్యాలు తారుమారు చేసిన ప్రభుత్వ డాక్టర్లపై చర్యలకు ఆదేశించింది. తమిళనాడులో ఈ సంఘటన జరిగింది. 2019లో మదురైకు చెందిన 17 ఏళ్ల ముత్తు కార్తీక్‌ను ఒక క్రిమినల్ కేసులో విచారణ కోసం ఎస్ఎస్ కాలనీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారణ సందర్భంగా ఆ యువకుడ్ని కస్టడీలో పోలీసులు దారుణంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన కార్తీక్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.
కాగా, కుమారుడి కస్టడీ మరణంపై కార్తిక్ తల్లి మద్రాస్ హైకోర్టుకు చెందిన మదురై బెంచ్‌ను ఆశ్రయించింది. దీంతో ఈ కేసు దర్యాప్తును సీబీ-సీఐడీకి కోర్టు బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో పోలీస్ ఇన్స్పెక్టర్ అలెక్స్ రాజ్, కానిస్టేబుల్స్ సతీష్, రవి, రవిచంద్రన్‌పై అభియోగాలు నమోదు చేశారు. ఆరేళ్ల విచారణ తర్వాత మదురై జిల్లా, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జోసెఫ్ జాయ్ సంచలన తీర్పు ఇచ్చారు. యువకుడి కస్టడీ డెత్ కేసులో ఆ నలుగురు పోలీసులను దోషులుగా నిర్ధారించారు. వారికి 11 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధించారు.
మరోవైపు ఆధారాలు నాశనం చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై ఇన్స్పెక్టర్ ప్రేమచంద్రన్, సబ్ ఇన్స్పెక్టర్ కన్నన్, ఇన్స్పెక్టర్ అరుణాచలంపై కొత్తగా చార్జిషీట్ దాఖలు చేయాలని సీబీ-సీఐడీని కోర్టు ఆదేశించింది. ప్రేమచంద్రన్, కన్నన్ పదవీ విరమణ చేయగా, ఇప్పటికీ సర్వీసులో ఉన్న ఇన్స్పెక్టర్ అరుణాచలంను వెంటనే సస్పెండ్ చేయాలని పేర్కొంది.
అలాగే కస్టోడియల్ హింసను కప్పిపుచ్చడానికి వైద్య రికార్డులను తారుమారు చేశారనే ఆరోపణలున్న ప్రభుత్వ వైద్యులను కోర్టు తీవ్రంగా మందలించింది. రిపోర్ట్‌లో గాయాల వివరాలను దాచినందుకు పోస్ట్‌మార్టం నిర్వహించిన డాక్టర్ జయకుమార్, ప్రభుత్వ ఆసుపత్రి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీలతపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. మదురై జిల్లా, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జోసెఫ్ జాయ్ ఈ మేరకు సెప్టెంబర్ 25న సంచలన తీర్పు ఇచ్చారు.
Also Read:
Boy Hides To Skip Tuition | ట్యూషన్‌కు వెళ్లకుండా దాక్కున్న బాలుడు.. తర్వాత ఏం జరిగిందంటే?
Girls Locked In Toilet Of Madrassa | మదర్సా టాయిలెట్లో.. 40 మంది బాలికల నిర్బంధం