న్యూఢిల్లీ : ధరల పెరుగుదలను నిరసిస్తూ లోక్‌సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ, ఆందోళనకు దిగిన నలుగురు కాంగ్రెస్ ఎంపీలను స్పీకర్ ఓం బిర్లా సస్పెండ్ చేశారు. ఎంపీలు మాణిక్యం ఠాగూర్, జ్యోతిమణి, రమ్య హరిదాస్, టీఎన్ ప్రతాపన్ను ఈ సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. సస్పెండ్‌కు గురైన నలుగురు ఎంపీలు.. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పీకర్ ప్రతిపక్షాలకు చెప్పారు. సభలో ప్లకార్డులు ప్రదర్శించడం, ఆందోళనకు దిగడం వంటి అంశాలను సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఒక వేళ ప్లకార్డులు ప్రదర్శించాలనుకుంటే.. సభ బయటే ఉండి నిరసన వ్యక్తం చేయాలని సూచించారు. తన మంచితనాన్ని బలహీనతగా చూడొద్దన్నారు.