చండీగఢ్, సెప్టెంబర్ 3: భారీ వరదలు పంజాబ్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. 1988 తర్వాత రాష్ట్రంలో ఇంత తీవ్రంగా వరదలు రావడం ఇదే మొదటిసారి. ఈ భారీ వరదల ప్రభావం 23 జిల్లాలపై పడింది. 37 మంది మరణించగా, 3.5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్‌లో భారీగా వానలు పడటంతో సట్లెజ్, బియాస్, రావి వంటి నదులు పొంగిపొర్లడంతో పంజాబ్‌లో 1,655 గ్రామాలపై వరద ప్రభావం పడింది. 1.48 లక్షల హెక్టార్లలో పంట నాశనమైంది. లక్షలాది ఎకరాలు 8 నుంచి 10 అడుగుల నీటిలో మునిగాయి. వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. అనేక గ్రామాలు వరద నీటిలో మునిగాయి. వరద నీటిలో చిక్కుకున్న వారిని పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పలు చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.