Wayanad | కేరళ (Kerala) రాష్ట్రం వయనాడ్‌లో కొండచరియలు (Wayanad landslides) విరిగిపడిన ఘటన యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. మంగళవారం తెల్లవారుజామున మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో భారీగా కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. ఈ విపత్తులో మరణించిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అధికారిక సమాచారం మేరకు ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 358కు పెరిగింది.
ఇంకా 281 మంది ఆచూకీ దొరకలేదు. శిథిలాల కింద ఉన్నవారిని గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు (radars used to find survivors). డ్రోన్లు, థర్మల్ స్కానర్ల ద్వారా గాలిస్తున్నారు. ముండక్కైలో కొట్టుకుపోయిన ఓ దుకాణం దగ్గర శిథిలాల కింద జీవం ఉండొచ్చని థర్మెల్ స్కానర్ అప్రమత్తం చేసింది. అయితే, 3 మీటర్ల లోతులో, ఐదు గంటల పాటు వెతికినా మనిషి ఆనవాళ్లు దొరకలేదు.
పశ్చిమ కనుమలు సున్నితమే.. కేంద్ర ముసాయిదా
మరోవైపు, పశ్చిమ కనుమలలోని 56,800 చదరపు కిలోమీటర్ల ప్రాంతం పర్యావరణపరంగా సున్నితమైనదని పేర్కొంటూ కేంద్రం ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. వయనాడ్‌లో కొండచరియల విధ్వంసానికి గురైన 13 గ్రామాలు కూడా దీని పరిధిలో ఉన్నాయి. పర్యావరణ సున్నిత ప్రాంతాలకు సంబంధించి తాజాగా ఇచ్చిన నోటిఫికేషన్‌పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే 60 రోజుల్లోగా తెలియజేయాలని ప్రభుత్వం కోరింది. కేరళలో 9993.7 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని సున్నిత ప్రాంతంగా పేర్కొంది. అదేవిధంగా హహారాష్ట్రలో 17,340, కర్ణాటకలో 20,668, తమిళనాడులో 6,914, గోవాలో 1,461, గుజరాత్లో 449 చదరపు కిలోమీటర్ల ప్రాంతం దీని కిందకు వస్తుందని తెలిపింది.
నది దిశ మార్చుకోవడంతోనే.. వయనాడ్‌లో అధిక నష్టం
వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడ్డ ఘటనకు సంబంధించి నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ విశ్రాంత శాస్త్రవేత్త సోమన్ కీలక విషయాలు వెల్లడించారు. ఈ విపత్తులో ఎక్కువగా నష్టం జరిగిన ముండక్కై, చూరల్మల ప్రాంతాలు నది ఒడ్డున ఉన్నాయని చెప్పారు. గతంలో ఇక్కడ కొండచరియలు విరిగి నదిలో పడి ఉండవచ్చని, అలా నదీ ప్రవాహం దిశ మారగా ఏర్పడిన ప్రాంతంపైనే ఇప్పుడు ఇండ్లు, దుకాణాలు వెలిశాయని ఆయన అభిప్రాయపడ్డారు. నీటికి గత ప్రవాహం గుర్తు ఉంటుందని, ఇప్పుడు నది గతంలో ప్రవహించిన దిశను మళ్లీ తీసుకోవడంతోనే ఇవన్నీ కొట్టుకుపోయి ఉండొచ్చని అన్నారు. కొండచరియలు విరిగిపడటం ప్రారంభమైన వెల్లరిమల సముద్రమట్టానికి 2వేల అడుగుల ఎత్తులో ఉందని, ముండక్కై, చూరల్మల మాత్రం 900 – 1000 అడుగుల ఎత్తులో ఉన్నాయని, కాబట్టి రాళ్లు చాలా బలంగా కిందకు దూసుకొచ్చాయన్నారు.
Also Read..
Nayanthara | వయనాడ్ విషాదం.. భారీ విరాళం ప్రకటించిన నయనతార, విఘ్నేశ్ దంపతులు
Kullu-Manali Highway: క్లౌడ్బస్ట్తో కొట్టుకుపోయిన కులు-మనాలీ రోడ్డు.. వీడియో