గౌహతి: వరదలు ముంచెత్తిన అస్సాంలోని బొగ్గు గని నుంచి మరో మూడు మృతదేహాలను వెలికితీశారు. దీంతో ఆ బొగ్గు గనిలో చిక్కుకున్న కార్మికుల్లో మరణించిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. (Assam coal mine) మిగతా వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. జనవరి 6న దిమా హసావో జిల్లా ఉమ్రాంగ్సోలోని బొగ్గు గనిలోకి అకస్మాత్తుగా వరద నీరు చేరింది. అస్సాం-మేఘాలయ సరిహద్దు సమీపంలోని పాడుబడిన 340 అడుగుల లోతైన ఈ ‘ఎలుక రంధ్రం’ గనిలో 9 మంది కార్మికులు చిక్కుకున్నారు. రెస్క్యూ బృందం, ఆర్మీ డైవర్లు కలిసి వారిని రక్షించేందుకు ఆరు రోజులుగా ప్రయత్నిస్తున్నారు.
కాగా, శనివారం ఉదయం తొలుత ఒక మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. కలమతి గ్రామానికి చెందిన 27 ఏళ్ల లిజెన్ మాగర్గా మృతుడ్ని గుర్తించారు. అనంతరం మరో రెండు మృతదేహాలను బయటకు తీశారు. అయితే ఇద్దరి మృతులను ఇంకా గుర్తించలేదు.
మరోవైపు నేపాల్‌కు చెందిన గంగా బహదూర్ శ్రేష్ఠో మృతదేహాన్ని బుధవారం వెలికితీశారు. దీంతో బొగ్గు గనిలో చిక్కుకున్న 9 మంది కార్మికుల్లో ఇప్పటి వరకు నలుగురు మరణించారు. మరో ఐదుగురు కార్మికుల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. నీటిని తోడితేగాని పూర్తిస్థాయిలో సహాయక చర్యలు సాధ్యం కావని అధికారులు పేర్కొన్నారు. 12 ఏళ్ల కింద వదిలేసిన ఈ బొగ్గు గనిలో అక్రమ తవ్వకాలకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
#WATCH | Assam | The third body has been recovered by the joint rescue team of the Indian army and NDRF from the inundated rat-hole coal mine at 3 Kilo Umrangso area in Dima Hasao district today. The second body was recovered this morning. pic.twitter.com/hDF9LiW5xF
— ANI (@ANI) January 11, 2025