భోపాల్: స్నానం కోసం మెట్ల బావిలోకి దిగిన ముగ్గురు బాలికలు అందులో మునిగి మరణించారు. మరో బాలిక ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో వారు అక్కడకు చేరుకున్నారు. బాలికలను బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. (3 Girls Drown In Stepwell) మధ్యప్రదేశ్లోని రైసెన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం ఉదయం 11 గంటలకు సాగర్ గ్రామానికి చెందిన 12, 13 ఏళ్ల వయస్సున్న నలుగురు బాలికలు స్నానం చేసేందుకు మెట్ల బావిలోకి దిగారు.
కాగా, వారిలో ఒక బాలిక లోతుకు వెళ్లి జారింది. నీటిలో మునిగిపోతుండటంతో ఆమెను కాపాడేందుకు మరో ఇద్దరు బాలికలు ప్రయత్నించారు. అయితే ఆ ముగ్గురు కూడా నీటిలో మునిగిపోయారు. మరో బాలిక ఇంటికి పరుగెత్తి కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పింది. దీంతో వారు అక్కడకు చేరుకున్నారు. బావిలో మునిగిన ముగ్గురు బాలికలను బయటకు తీశారు. ఆసుపత్రికి తరలించగా వారు అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
మరోవైపు మరణించిన ముగ్గురు బాలికల్లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు. మరో బాలిక సోదరి కూడా ఈ ప్రమాదంలో చనిపోయింది. దీంతో బంధువులైన ఆ రెండు కుటుంబాల్లో విషాదం నెలకొన్నది. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.