India | న్యూఢిల్లీ: విదేశాల్లో ఉద్యోగమంటే.. మంచి జీతం, జీవితం.. మన యువతలో ఉండే ఈ ఆకర్షణను సైబర్ నేరగాళ్లు అవకాశంగా మార్చుకుంటున్నారు. నకిలీ జాబ్ ఆఫర్లు ఇచ్చి దేశం కాని దేశంలో సైబర్ బానిసలుగా మారుస్తున్నారు. వారిని హింసిస్తూ వారితో సైబర్ మోసాలు చేయిస్తున్నారు. ఇప్పటివరకు ఇలాంటి మోసాలు జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నప్పటికీ తాజా నివేదిక ఇది ఎంత తీవ్రంగా ఉందో బయటపెట్టింది. 2022 జనవరి నుంచి ఈ ఏడాది మే వరకు ఆగ్నేయాసియా దేశాలకు వెళ్లిన దాదాపు 29 వేల మంది భారతీయుల ఆచూకీ గల్లంతయ్యిందని ఓ నివేదిక వెల్లడించింది. ఇందులో ఎక్కువమంది కంబోడియా, లావోస్ దేశాల్లో సైబర్ బానిసలుగా మారిపోయారని పేర్కొన్నది. థాయ్లాండ్, వియత్నాం వంటి దేశాలకు విజిటింగ్ వీసాలపై వెళ్లిన వారు కూడా ఇందులో పెద్ద సంఖ్యలో ఉన్నట్టు తెలిపింది. ఎక్కువగా వీసా ఆన్ అరైవల్ పద్ధతిలో వెళ్తున్న వారి ఆచూకీ తెలియడం లేదని వెల్లడించింది.
ఆగ్నేయాసియా దేశాల నుంచి పని చేస్తున్న సైబర్ మోసాల రాకెట్లు భారత్తో పాటు నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాల యువతను విదేశాల్లో ఉద్యోగాల పేరుతో సోషల్ మీడియా ద్వారా ఆకర్షిస్తున్నాయి. నమ్మి వెళ్లిన యువకుల వీసాలు లాక్కొని వారితో రకరకాల సైబర్ మోసాలు చేయిస్తున్నాయి. ఏ దేశ ప్రజలను ఆ దేశం వారితో అయితేనే మోసగించవచ్చనే వ్యూహంతో వీరిని బలిచేస్తున్నాయి. జిన్ బె గ్రూప్, కింగ్స్ రోమన్స్ గ్రూప్, ప్రిన్స్ గ్రూప్ వంటి ముఠాలు ఇందులో ప్రధానమైనవని ఈ నివేదిక పేర్కొన్నది. ఈ ముఠాల నకిలీ ఉద్యోగ ప్రకటనలు నమ్మి వెళ్లే యువకులను మారుమూల ప్రాంతాల్లో పెట్టి కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా హింసిస్తున్నాయని తెలిపింది. సైబర్ బానిసలుగా మారిన వారిని రక్షించి తిరిగి స్వదేశాలకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు చర్యలు తీసుకోవాలని ఈ నివేదిక సూచించింది.