తీవ్ర ఆందోళనలో బంధువులు
న్యూఢిల్లీ, మే 14: దేశ రాజధాని ఢిల్లీలోని ముండ్కా ఏరియాలో శుక్రవారం జరిగిన భారీ అగ్నిప్రమాదం ఘోర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 27 మంది మరణించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇంకా 29 మంది జాడ తెలియాల్సి ఉన్నదని పొలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తమ వారి ఆచూకీపై బంధువులు ఆందోళన చెందుతున్నారు. తమ వారి కోసం దవాఖానల్లో వెతుకున్నారు.
శనివారం ఉదయం నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్లో భవనంలోని ఓ ఫ్లోర్లో కాలిపోయివున్న పలు మానవ అవశేషాలను గుర్తించారు. దీంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. అగ్నిప్రమాదం జరిగిన భవనానికి ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ లేదని అధికారులు గుర్తించారు. తప్పించుకునే మార్గం కూడా భవనంలో ఒక్కటి మాత్రమే ఉండటంతో మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్నదని చీఫ్ ఫైర్ ఆఫీసర్ అతుల్ గార్గ్ పేర్కొన్నారు. ఘటనాస్థలికి సీఎం కేజ్రీవాల్ శనివారం సందర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, క్షతగ్రాతులకు రూ.50 వేల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.