Train Tickets | హైదరాబాద్ సిటీబ్యూరో, (నమస్తే తెలంగాణ)/న్యూఢిల్లీ : తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న రైళ్లలో ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ తరగతుల టిక్కెట్ చార్జీలపై గరిష్ఠంగా 25 శాతం వరకు రాయితీ ఇస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. డిస్కౌంట్ చార్జీల అమలు తక్షణం అమల్లోకి వస్తాయని ప్రకటించింది. వందే భారత్ సహా అనుభూత్, విస్టాడోమ్ కోచ్‌లతో నడిచై రైళ్లలో టిక్కెట్ బేసిక్ చార్జీలో 25 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తారు. రిజర్వేషన్, సూపర్ ఫాస్ట్ చార్జీ, జీఎస్టీ యథాతథంగానే ఉంటాయి. ఈ తగ్గింపు వల్ల వందే భారత్, శతాబ్ది లాంటి రైళ్ల ప్రయాణికులకు బాగా ప్రయోజనం కలుగుతుంది.
రైలు ప్రయాణించే మొత్తం దూరానికి లేదా కొన్ని నిర్దేశిత సెక్షన్లలో గత 30 రోజుల ప్రయాణికుల ఆక్యుపెన్సీని పరిగణనలోకి తీసుకుని 50 శాతం కన్నా తక్కువ మంది ప్రయాణికులున్న రూట్లలో వీటిని అమలు చేస్తారు. ఈ డిస్కౌంట్ మొత్తం ప్రయాణ దూరానికి లేదా కొంత దూరానికి సీజన్/వారాలు/ డిమాండ్ ప్రాతిపదికన వర్తింపచేస్తారు. చార్జీల రాయితీ ఇక నుంచి టిక్కెట్లు కొనుగోలు చేసే వారికే తప్ప, గతంలో బుక్ చేసుకున్న వారికి వర్తించదు. తగ్గించిన మొత్తాన్ని వారికి వాపసు ఇవ్వరు. అయితే కొన్ని రైళ్లలో ఇప్పటికే అమలవుతున్న ఫ్లెక్సీ చార్జీ విధానాన్ని కూడా తొలగించి దీనిని అమలు చేస్తారు.
అయితే సెలవులు, పండుగల సందర్భంగా నడిపే ప్రత్యేక రైళ్లలో చార్జీలను తగ్గించరు. తత్కాల్ కోటాలో టిక్కెట్లకు ఈ పథకం వర్తించదని అధికారులు తెలిపారు. రైల్వే పాసులు, రాయితీ వోచర్లు, ఎమ్మెల్యే కూపన్లు, వారెంట్లు, ఎంపీలు, మాజీ ఎంపీలు, స్వాతంత్య్ర సమరయోధుల కోటా టిక్కెట్లపై ఒరిజినల్ చార్జీల ఆధారంగా బుక్ అవుతాయని, రాయితీ ధరపై కాదన్నారు.