Indian Fishermen | పాకిస్థాన్ కరాచీలోని మాలిర్ జైలులో ఉన్న 22 మంది భారతీయ జాలర్లు విడుదలయ్యారు. ఆయా జాలర్లను శనివారం భారత్‌కు అప్పగించే అవకాశం ఉన్నది. మత్స్యకారుల విడుదలపై మాలిర్ జైలు సూపరింటెండెంట్ అర్షద్ షా మీడియాకు సమాచారం ఇచ్చారు. ఈదీ ఫౌండేషన్ అధ్యక్షుడు ఫైసల్ ఈదీ జాలర్లు లాహోర్‌కు చేరుకునేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రయాణ ఖర్చులను భరించడంతో పాటు వారికి పలు కానుకలతో పాటు ఆర్థిక సహాయాన్ని సైతం అందించారు. జాలర్లు లాహోర్ నుంచి భారత్‌కు తిరిగి చేరుకోనున్నారు. జాలర్లు సుదీర్ఘంగా జైలు శిక్ష అనుభవించారని.. ఆయా కుటుంబాల వేదనను ఎత్తిచూపుతూ.. శిక్షాకాలం పూర్తయిన వెంటనే వారిని విడుదల చేసి స్వదేశానికి తిరిగి పంపేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. దురుద్దేశం లేకుండా పాక్ జలాల్లోకి ప్రవేశించిన వారి విషయంలో దయతో ఉండాలని కోరారు.
జాలర్లను పాక్ అధికారులు వాఘా సరిహద్దుకు తీసుకువచ్చి.. అక్కడ భారత అధికారులకు అప్పగించే ప్రక్రియను పూర్తి చేస్తారు. ఆ తర్వాత భారత అధికారులు వారిని సొంత ఊళ్లకు పంపేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. వాస్తవానికి ఒక దేశం జాలర్లు.. మరో దేశం జలాల్లోకి ప్రవేశించిన సమయంలో అరెస్టు చేస్తుంటారు. ఈ ఏడాది జనవరి ఒకటిన ఇరు దేశాలు ఖైదీల జాబితాను మార్పుడు చేసుకున్నాయి. ఈ జాబితా మేరకు.. పాకిస్థాన్‌లో 266 మంది భారతీయ ఖైదీలు ఉండగా.. ఇందులో 217 మంది జాలర్లు ఉన్నారు. ఇక భారత్‌లో 81 మంది జాలర్లు సహా 462 మంది పాక్ ఖైదీలు ఉన్నారు. ఇదిలా ఉండగా.. శ్రీలంక జైళ్లలో మగ్గుతున్న జాలర్లను విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని తమిళనాడు సీఎం స్టాలిన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. శ్రీలంక నావికాదళం జాలర్లను భారీగా అరెస్టు చేస్తుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. జాలర్లు, వారి పడవలను తక్షణమే విడుదల చేసేలా దౌత్యపరంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.