Pinarayi Vijayan | కేరళ రాష్ట్రం వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన యావత్తు దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 358 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ఘటనలో సహాయక చర్యలు చివరిదశలో ఉన్నాయని కేరళ సీఎం పినరయి విజయన్ (Pinarayi Vijayan) తాజాగా వెల్లడించారు. ఇప్పటి వరకూ 215 మృతదేహాలను వెలికితీసినట్లు చెప్పారు (215 bodies recovered).
‘కొండచరియలు విరిగిపడిన ఘటనలో సహాయక చర్యలు చివరి దశకు వచ్చాయి. ఇప్పటి వరకూ సహాయక బృందాలు ఘటనాస్థలం నుంచి 215 మృతదేహాలను వెలికితీశాయి. అందులో 98 మంది పురుషులు, 87 మంది మహిళలు, 30 మంది చిన్నారుల మృతదేహాలు ఉన్నాయి. 143 శరీర భాగాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకూ 148 మృతదేహాలను గుర్తించి బంధువులకు అప్పగించాం. ఈ ఘటనలో మొత్తం 504 మంది గాయాలతో ఆసుపత్రిలో చేరారు. అందులో 205 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరో 82 మంది వయనాడ్, కోజికోడ్, మలప్పురం జిల్లాల్లోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సుమారు 206 మంది ఈ విపత్తుల్లో గల్లంతయ్యారు’ అని సీఎం వివరించారు. మరోవైపు ఘటనాస్థలం నుంచి 10,042 మందిని రక్షించినట్లు సీఎం తెలిపారు. వారందరినీ షెల్టర్ క్యాంపులకు తరలించినట్లు వెల్లడించారు.
వార్నింగ్ సిస్టమ్స్‌ను అభివృద్ధి చేయాలి..
ఈ విపత్తు నేపథ్యంలో ముందస్తు హెచ్చరికల వ్యవస్థలను సవరించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా సీఎం అన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వార్నింగ్ సిస్టమ్స్‌ను అభివృద్ధి చేయాలన్నారు. కొండచరియలు విరిగిపడటంతో పూర్తిగా కొట్టుకుపోయిన చూరల్మలలో ప్రత్యేక టౌన్షిప్ భాగాన్ని నిర్మించాలని సీఎం విజయన్ ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. చూరల్మలలో 100 ఇళ్ల నిర్మాణం చేపడతామని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ప్రకటించారని.. అదేవిధంగా 100 ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సైతం ముందుకొచ్చారని తెలిపారు. మరోవైపు విపత్తు నేపథ్యంలో బాధితుల సహాయార్థం కేరళ సీఎం డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ (CMDRF)కు విరాళాలు అందించిన సినీ నటులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలకు సీఎం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
Also Read..
Pinarayi Vijayan | కొండచరియలు విరిగిపడిన ఘటన.. సీఎండీఆర్ఎఫ్కు కేరళ సీఎం విరాళం
Mohanlal | లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో.. వయనాడ్‌లో పర్యటించిన మలయాళ నటుడు మోహన్‌లాల్
Nayanthara | వయనాడ్ విషాదం.. భారీ విరాళం ప్రకటించిన నయనతార, విఘ్నేశ్ దంపతులు