న్యూఢిల్లీ: రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపూర్‌లో ప్రజాదరణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్రానికి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు కోరారు. ( Manipur MLAs Write To PM Modi) ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు. 13 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ)కి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్)కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఆ లేఖలో సంతకం చేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చి మూడు నెలలైనప్పటికీ శాంతి, సాధారణ పరిస్థితి తీసుకువచ్చేందుకు ఎలాంటి చర్యలు కనిపించలేదని విమర్శించారు.
కాగా, రాష్ట్రంలో మళ్ళీ హింస చెలరేగే అవకాశం ఉందనే భయం ప్రజల్లో ఉందని ఎమ్మెల్యేలు ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి పాలన విధించడాన్ని అనేక పౌర సంస్థలు బహిరంగంగా వ్యతిరేకిస్తున్నాయని, నిరసనలు చేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజాదరణ పొందిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయని, తాము కూడా ఇదే భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 10న రాసిన ఈ లేఖ ఏప్రిల్ 29న ప్రధానమంత్రి కార్యాలయానికి అందినట్లు సమాచారం.
మరోవైపు 2023 మే నుంచి మణిపూర్‌లోని మైతీ, కుకీ తెగల మధ్య పోరాటం తీవ్రమైంది. ఈ జాతి హింసలో 260 మందికి పైగా మరణించగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. సీఎం ఎన్ బిరెన్ సింగ్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆ పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించారు.