న్యూఢిల్లీ: వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న ప్రతిపాదిత విద్యుత్తు (సవరణ) బిల్లు, 2025ను వెంటనే ఉపసంహరించుకోకపోతే 2020-21 తరహా ఉద్యమాన్ని పునరావృతం చేస్తామని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) బుధవారం కేంద్రాన్ని హెచ్చరించింది. తమ సభ్యులు ఈ నెల 28న సమావేశమై కార్యాచరణను నిర్ణయిస్తారని తెలిపింది. ప్రతిపాదిత విత్తన బిల్లు, నాలుగు కార్మిక చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఇవి కేంద్రీకరణ వైపు మరింత అడుగులు వేసే చర్యలని ఎస్కేఎం పేర్కొంది.
జాతీయ విద్యా పాలసీ, 2020ను కూడా వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. రైతులు ఆహారం, దుస్తులు, బ్యాగ్లు సిద్ధం చేసుకుని మరో నిరవధిక ఆందోళనకు సిద్ధం కావాలని బీకేయూ (రాజేవాల్) అధ్యక్షుడు బల్బీర్ సింగ్ కోరారు. ఈసారి మన పోరాటం మరింత తీవ్ర స్థాయిలో ఉంటుందని ఆయన అన్నారు. ప్రతిపాదిత విద్యుత్తు (సవరణ) బిల్లు కార్పొరేట్ రంగానికి విద్యుత్తు పంపిణీ వ్యవస్థపై పూర్తి నియంత్రణ తెచ్చే ఒక కచ్చితమైన మార్గమని బీకేయూ (ఏక్తా-ఉగ్రహన్) ఆరోపించింది.