మంగళవారం 14 జూలై 2020
National - Jun 29, 2020 , 18:16:15

ఆషాడ మాసం ప్రత్యేకతలు ?

ఆషాడ మాసం ప్రత్యేకతలు ?

హైదరాబాద్ : హిందూ సంప్రదాయాల్లో ఒక్కో మాసానికి ఒక్కో ప్రత్యేకత ఉన్నది. అటువంటి వాటిల్లో "ఆషాఢమాసం" ఒకటి. దీనినే "శూన్య  మాసం" అంటారు. ఈ మాసంలో ముహుర్తాలు ఉండవు.ఈ మాసంలో చేసే స్నానం, దానం, జపం , పారాయణలు, విశేష ఫలితాన్నిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. తొలకరి జల్లులు, మట్టి తడిసిన వాసనలతో పుడమి పులకింతలు, లేత చిగుర్లు, కాగితం పడవలతో ఆటలు, మొలకెత్తిన విత్తనాలు, కొత్త అల్లుళ్లకు ఆషాఢ పట్టీ వినోదాలు,తక్కువ ధరలతో మార్కెట్ల హోరు, గోరింటాకుతో ముదితల ఆనందం, అమ్మ వారికి భోజనం, బోనం, గురువులను ఆరాధించే సమయము గురు పౌర్ణమి, స్థితికారుడైన విష్ణువు యోగ నిద్రకు ఉపక్రమించే సమయము, తొలి ఏకాదశి, నదులు పరవళ్లు తొక్కుతూ సముద్రుడిని  చేరుకోడానికి ఆరాట పడుతూ వెళ్లే సమయము, సన్యాసాశ్రమములో ఉన్నవారు చాతుర్మాస్య వ్రతాన్ని తాము ఎక్కడ ఉన్నారో అక్కడే ప్రారంభించే కాలము. ఒకటా రెండా, సంస్కృతి, సంప్రదాయము,ఆధ్యాత్మికత, ఆచారం, ఆనందం,కోలాహలం ఇన్నిటి కలయిక ఆషాఢ మాసం.

అయితే ఎందుకు ఇన్ని రకాల వైవిధ్యములు ఈ మాసంలోనే ఉన్నాయి అంటే, మనది భారత దేశము. భారత దేశము వ్యవసాయాధారిత దేశము. ఆషాఢ మాసము వర్షాలు పడడము ప్రారంభము అయి వ్యవసాయం కోసం ఇంట్లో వారంతా కష్టపడి పని చేసేందుకు ముందుకు వెళ్ళవలసిన సమయము. అందుకే అత్తా, కోడళ్ళు ఒక చోట ఉండకూడదన్న నియమం పెట్టి కొత్త పెండ్లి  కూతుర్ని పుట్టింటికి పంపే ఒక ఆచారం పెట్టారు మన పెద్దలు.  అప్పుడే  పెళ్లి అయ్యి కొత్తగా వేరే వాళ్ళ ఇంటికి వచ్చిన అమ్మాయి,  పుట్టింటికి కొంత కాలం వెళ్లి నప్పుడు ఇక్కడికి, అక్కడకు ఉన్న సామ్యం ఏమిటి? ఏ విషయంలో వైవిధ్యం ఉంది? వేరుగా ఉన్నారు అన్న విషయం ఒకసారి మానసికముగా తరచి చూసుకుని అత్తగారి ఇంటికి తగినట్లుగా తనను తాను మలచుకోవడానికి ఒక చక్కని అవకాశము.

అలాగే అప్పటి వరకు ఇంట్లో తిరిగిన కోడలు కొంత కాలము కనిపించక పోవడంతో అయ్యో, కోడలు కనిపించడం లేదు అన్న బాధ అత్త, మామలకు కలగడం, ఇంట్లో మిగిలిన వారికీ కలగడంతో, ఒకరిపై ఒకరికి ఆప్యాయత పెరిగి, ఆ మాసము అయిపోగానే ఆ అమ్మాయి తిరిగి వచ్చినప్పుడు అత్యంత ఆదరంతో ఆ అమ్మాయికి ఆహ్వానం పలుకుతారు. పెద్దలు ఎంతో ముందు చూపుతో పెట్టిన ఒక సత్సంప్రదాయం ఇది. అంతేకాకుండా, ఈ మాసంలో కనుక ఆడపిల్ల గర్భము ధరిస్తే, ప్రసవం అయ్యేవరకు భానుడు చండ ప్రచండంగా ఉంటాడు. అంటే దాదాపు మే నెలలో అలాగ ప్రసవం అయ్యే సమయము . ఇప్పుడు అంటే అన్ని వసతులు ఉన్నాయి కనుక ఇబ్బంది కాదు.

  ఈ ఆచార,వ్యవహారములు ఈ మాసములో పెట్టినప్పుడు ఇన్ని వసతులు, ఇన్ని సౌకర్యాలు లేవు కనుక అంత ఎండాకాలంలో ప్రసవం అయితే పుట్టిన బిడ్డకు, తల్లికీ ప్రమాదం కనుక, అలాంటి కష్టం రాకూడదు అన్న ఆలోచనతో ఈ నెలలో అమ్మాయిని పుట్టింటికి పంపించడం అనేది ముందు చూపుతో మన పెద్దలు ఏర్పాటు చేశారు. ఆ తరువాత ఈ నెలలోనే నిజానికి వివాహం వంటి వాటికి ముహుర్తాలు లేక పోయినా కూడా, పుడమి పులకించడంతో ఎక్కడ చూసినా కూడా హరిత హారములాకనిపిస్తూ  ఉంటుంది.ఎక్కడ చూసినా కూడా ఏదోలా దుమ్ము,ధూళితో ఉన్న చెట్లు అన్నీ తొలకరి జల్లులకు తలంటి పోసుకున్నట్లుగా కనిపిస్తూ ఉంటాయి.  ప్రకృతి పచ్చని చెట్లు చేమల పులకరింతలతో కనిపిస్తుంది. 


logo