న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: మయన్మార్‌లోని మ్యావడీ కేంద్రంగా భారతీయులను మోసం చేసే సైబర్ ముఠాలు చురుగ్గా పని చేస్తున్నాయి. ఉద్యోగాల ఎర వేసి భారత యువతను ఆకర్షిస్తున్న ముఠాలు.. అక్కడికి వెళ్లిన తర్వాత వారితో నిర్బంధంగా పని చేయించుకుంటున్నాయి. వారితో భారత్‌లోని ప్రజలను లక్ష్యంగా చేసుకొని బలవంతంగా సైబర్ మోసాలు చేయిస్తున్నాయి. ఇటీవల ఓ సైబర్ ముఠా చెర నుంచి ముగ్గురు భారతీయులు తప్పించుకోవడంతో ఈ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.
మయన్మార్ – థాయ్‌లాండ్ సరిహద్దులోని మ్యావడీ ప్రాంతం సాయుధ మిలీషియా ఆధీనంలో ఉండటం, ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో సైబర్ ముఠాలు ఈ ప్రాంతంలో తిష్ఠ వేశాయి. ఎవరైనా బాధితులు తప్పించుకొని దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కు వస్తే తప్ప వారిని రక్షించేందుకు భారత రాయబార కార్యాలయం సైతం ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నది. డిసెంబర్ నుంచి ఇప్పటివరకు మ్యావడీలో ఆరుగురిని రక్షించినట్టు యాంగోన్లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఇప్పటికీ దాదాపు 2 వేల మంది భారతీయులు ఈ సైబర్ ముఠాల వలలో చిక్కుకొని ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.