న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కుల మ్యారేజ్(Same-Sex Marriages) గురించి సుప్రీంకోర్టులో 20 పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఆ పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు వాదనలు మొదలుపెట్టింది. తమకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు ఎల్జీబీటీ పౌరులకు కూడా కల్పించాలని ఆ పిటిషన్లలో డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టుకు చెందిన అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఈ కేసును పరిశీలిస్తున్నది. ఆ బెంచ్‌లో సీజేఐ డీవై చంద్రచూడ్ తో పాటు జస్టిస్ ఎస్కే కౌల్, రవీంద్ర భట్, హిమా కోహ్లీ, పీఎస్ నర్సింహాలు ఉన్నారు.
సేమ్ సెక్స్ మ్యారేజీలను కేంద్రం వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. స్వలింగ సంపర్కుల వివాహాలపై నిర్ణయం తీసుకునే అధికారం చట్టసభలకే వదిలేయాలని సుప్రీంకోర్టుకు కేంద్రం చెప్పింది.
గే మ్యారేజీలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ సుప్రియా చక్రవర్తి, అభిజిత్ అయ్యర్ మిత్ర, అదితి ఆనంద్; అంబూది రాయ్, డాక్టర్ కవిత ఆరోరా, హరీశ్ అయ్యర్, జయదీప్ సేన్‌గుప్తా, కాజల్, మెలిసా ఫెరేరి, నిబేదితా దత్తా, నికేశ్ పీపీ, నితిన్ కరానీ, పర్త్ ఫిరోజ్ మెహరోత్రా, రితుపర్న బోరా, సమీర్ సముద్ర, ఉదిత్ సూద్, ఉత్కర్ష్ సక్సేనా, వైభవ్ జైన్, డాక్టర్ అక్కాయి పద్మశాలి, జైనాబ్ పటేల్‌లు సుప్రీంలో పిటిషన్ వేశారు.