ఉదయం 6 నుంచి 10 వరకే నిత్యావసర దుకాణాలు
ప్రజా రవాణా బంద్..
రాత్రి కర్ఫ్యూ కొనసాగింపు
బెంగళూరు, ఏప్రిల్ 26: కరోనా కేసుల ఉద్ధృతితో కర్ణాటకలో 14 రోజుల ‘క్లోజ్ డౌన్’ను అమలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి ఈ ఆంక్షలు అమలులోకి వస్తాయి. ఈ విషయాన్ని సోమవారం మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం బీఎస్ యెడియూరప్ప తెలిపారు. లాక్డౌన్ తరహా ఆంక్షలనే విధించినప్పటికీ దాన్ని క్లోజ్ డౌన్ అని కర్ణాటక ప్రభుత్వం పేర్కొంటున్నది. నిత్యావసర వస్తువుల దుకాణాలకు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు తెరవడానికి అనుమతి ఉంటుంది. ఇప్పటికే అమలు చేస్తున్న రాత్రి కర్ఫ్యూ కొనసాగుతుంది. ‘క్లోజ్ డౌన్’ కాలంలో ప్రజా రవాణా కూడా నిలిచిపోనున్నది. వస్తువుల రవాణా, అత్యవసర సేవల వాహనాలకు మినహాయింపు ఉంటుంది. వ్యవసాయ, తయారీ, నిర్మాణ రంగాల కార్యకలాపాలు కొనసాగనున్నాయి. వాటికి ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు. రెండు వారాల్లో పరిస్థితి అదుపులోకి రాకపోతే ఆంక్షలను కొనసాగించాల్సి ఉంటుందని యెడియూరప్ప అన్నారు. 18-44 ఏండ్ల వారికి ప్రభుత్వ దవాఖానాల్లో కరోనా టీకా ఉచితంగా అందిస్తామని తెలిపారు.
పంజాబ్‌లో నైట్ కర్ఫ్యూ.. వారాంతపు లాక్డౌన్
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా పంజాబ్ ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూ విధించింది. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రకటించింది. వారాంతంలో పూర్తిగా లాక్డౌన్ అమలవుతుందని పేర్కొన్నది. కరోనా కట్టడికి విధించిన ఆంక్షలను కేరళ ప్రభుత్వం పొడిగించింది. కొత్తగా మరికొన్ని నిబంధనలను విధించింది. శని, ఆదివారాల్లో కేవలం నిత్యావసరాలు, ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపింది. థియేటర్లు, క్లబ్‌లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మూసే ఉంటాయని పేర్కొన్నది. వలస కూలీల కోసం అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నది.