ముంబై: ఇద్దరు కొడుకులు నిద్రిస్తున్న తల్లిదండ్రులను హత్య చేశారు. ఆ తర్వాత రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తండ్రి అనారోగ్యం వల్ల అప్పులపాలు కావడంతో వారిద్దరూ ఇలా చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. (Sons Kill Parents, Jump In Front Of Train) మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. డిసెంబర్ 25న జవాలా మురార్ గ్రామానికి చెందిన 51 ఏళ్ల రమేష్ సోనాజీ లాఖే, 45 ఏళ్ల భార్య రాధాబాయి వారి ఇంట్లో మంచంపై మరణించడాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు ఆ ఇంటికి చేరుకున్నారు. దంపతుల మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిద్రిస్తున్న ఆ భార్యాభర్తలను గొంతునొక్కి చంపినట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తేలింది.
కాగా, అదే రోజున ఆ గ్రామానికి కొంత దూరంలోని రైలు పట్టాలపై ఆ దంపతుల కుమారులులైన 25 ఏళ్ల ఉమేష్, 23 ఏళ్ల బజరంగ్ మృతదేహాలు కనిపించాయి. దీంతో వారిద్దరి మృతదేహాలను కూడా పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అన్నాదమ్ములు రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.
మరోవైపు ఒకే రోజు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వేర్వేరుగా మరణించిన ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేశారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. పక్షవాతంతో మంచానికి పరిమితమైన రమేష్ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఆయనకు చికిత్స కోసం ఆ కుటుంబం అప్పులపాలైనట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో ఆర్థిక బాధలు తట్టుకోలేక ఇద్దరు కుమారులు తమ తల్లిదండ్రులను చంపి ఆ తర్వాత రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు గ్రహించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
4 dead due to brazier | వెచ్చదనం కోసం మంట రాజేసి నిద్రించిన కుటుంబం.. నలుగురు మృతి
Ropeway Collapses | బీహార్‌లో కొత్తగా నిర్మించిన రోప్‌వే.. ట్రయల్ రన్లో కూలింది
Watch: రాత్రి వేళ స్కూటీపై వెళ్తున్న మహిళ.. వెంటపడి వేధించిన ముగ్గురు