లక్నో: పునరావాస కేంద్రానికి చెందిన పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. ఇద్దరు పిల్లలు మరణించగా 23 మంది ఆసుపత్రిపాలయ్యారు. (Children Die) పిల్లల అస్వస్థతకు నీటి కాలుష్యం కారణమని అనుమానిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. మార్చి 25న మోహన్ రోడ్‌లోని నిర్వాన్ రాజ్‌కియా బాల్ గ్రాహ్ విశేషికృత్ పునరావాస కేంద్రంలోని 25 మంది పిల్లలు వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఇద్దరు పిల్లలు మరణించారు. మృతులను 16 ఏళ్ల రేణు, దీపగా గుర్తించారు. మరో 23 మంది పిల్లలకు చికిత్స అందిస్తున్నారు.
కాగా, పునరావాస కేంద్రంలో కలుషిత నీటి వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగి ఉంటుందని చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ అనుమానం వ్యక్తం చేశారు. కొంతమంది పిల్లలకు రక్తహీనతతో పాటు కిడ్నీ వ్యాధి ఉన్నట్లుగా నిర్ధారణ అయిందని తెలిపారు. అయితే ఇద్దరు పిల్లల మృతికి అసలు కారణం ఏమిటన్నది పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తెలుస్తుందని చెప్పారు. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంలో నిర్వహిస్తున్న పిల్లల పునరావాస కేంద్రాన్ని వైద్యులు, అధికారులు సందర్శించారు. అక్కడి తాగు నీటిని పరిశీలించారు. వాటర్ ట్యాంకులను శుభ్రం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఆ కేంద్రంలోని 70 మందికిపైగా పిల్లల ఆరోగ్యాన్ని డాక్టర్లు పరిశీలించారు. కొంత మందిని అబ్జర్వేషన్లో ఉంచినట్లు అధికారులు తెలిపారు.