న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్లో ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) అనంతరం సుమారు 2.8 కోట్ల మంది పౌరులను ఓటరు జాబితా నుంచి తొలగించారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ర్టాల్లో నిర్వహిస్తున్న సర్వేలో ఇదే అత్యధిక తొలగింపుగా అధికారులు నిర్ధారించారు. సర్ అనంతరం యూపీ ఓటరు జాబితా ముసాయిదాను సోమవారం విడుదల చేశారు. రాష్ట్రంలో 15 కోట్ల మందికి పైగా ఓటర్లుండగా, విస్తృతంగా నిర్వహించిన ప్రత్యేక సమగ్ర సవరణ అనంతరం పాత జాబితాలోని 12 కోట్ల మంది మాత్రమే ధ్రువీకరణ ఫారాలను సంతకం చేసిన తర్వాత స్వయంగా లేదా వారి కుటుంబ సభ్యుల ద్వారా అందజేశారని ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. అంటే పాత జాబితాలోని 81 శాతం మంది మాత్రమే ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారని, 18 శాతం మంది తిరిగి ఇవ్వలేదని ఆయన చెప్పారు. వీరిలో 46.23 లక్షల మంది ఓటర్లు మరణించారని, 2.17 కోట్ల మంది ఇతర ప్రాంతాలకు వలసపోయారని తెలిపారు.