Indian Railway | న్యూఢిల్లీ, జూలై 31: దేశంలో రైల్వే శాఖ పట్టాలు తప్పుతున్నది. ప్రయాణికుల భద్రతను ప్రమాదంలోకి నెడుతున్నది. గత 7 నెలల కాలంలో దేశంలో ఏకంగా 19 రైలు ప్రమాద ఘటనలు చోటుచేసుకున్నాయి. ఒక్క జూలైలోనే నాలుగు రైళ్లు పట్టాలు తప్పాయి. వరుసగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నప్పటికీ కేంద్రంలోని మోదీ సర్కారు నిర్లక్ష్య వైఖరిని వీడటం లేదు. ఏటా లక్షల కోట్ల ఆదా యం సమకూరుతున్నా ట్రాక్ల నిర్వహణకు నిధులు ఏటికేడు తగ్గిస్తుండటంతో ప్రయాణికుల భద్రత గాలిలో దీపంలా మారింది.
ట్రాక్ల నిర్వహణ సక్రమంగా లేకపోవడం, నిర్వహణ లోపాలు, పాతకాలం నాటి సిగ్నలింగ్ వ్యవస్థలు, వాతావరణంలో మార్పులు తదితర కారణాల వల్ల రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. బడ్జెట్లో మూలధన వ్యయాల్లో ట్రాక్ నిర్వహణ వ్యయం కేటాయింపులు 2022 ఆర్థిక సంవత్సరంలో 14.1 శాతం ఉండగా, 2023 నాటికి ఇది 10.3 శాతానికి , 2024కు 7 శాతానికి తగ్గిపోయింది. 2022లో కాగ్ నివేదిక సైతం ట్రాక్ నిర్వహణకు ప్రతిఏడాది బడ్జెట్లో కేటాయింపులు తగ్గిపోవడాన్ని, కేటాయించిన నిధులను పూర్తిగా ఖర్చు పెట్టకపోవడాన్ని తప్పుబట్టింది.
ఇది రైల్వే ప్రయాణికులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంది. ఇక 2022-23లో రైల్వే ఆదాయం రూ.1.2 లక్షల కోట్లు కాగా, అందులో ట్రాక్ పునరుద్ధరణ ఖర్చులు 13.5 శాతం ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో రైల్వే ఆదాయం 1.5 లక్షల కోట్లకు పెరిగినా ట్రాక్ పునరుద్ధరణ ఖర్చును మాత్రం 11 శాతానికి తగ్గించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది మరింత దిగజారింది. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో 1.8 లక్షల కోట్ల ఆదాయం అంచనా వేస్తుండగా, ట్రాక్ ఖర్చులను 9.7 శాతానికే పరిమితం చేశారు.
దేశీయ సాంకేతికతో బుల్లెట్ ట్రైన్లు
దేశంలో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతోనే బుల్లెట్ రైళ్లను అభివృద్ధి చేసే పనిలో ప్రభుత్వం ఉన్నట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం తెలిపారు. లోక్సభలో ఒక ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ ప్రస్తుతం అహ్మదాబాద్-ముంబై మధ్య చేపట్టిన బుల్లెట్ రైలు ప్రాజెక్టు సాంకేతికంగా క్లిష్టమైనదని, దానిని జపాన్ సాయంతో చేపట్టినట్టు చెప్పారు. భారత్ పరిస్థితులకు అనుగుణంగా అత్యంత పటిష్ఠ భద్రతా ప్రమాణాలతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నామన్నారు. అయితే ఆత్మనిర్భర్ పథకం కింద పూర్తి దేశీయ పరిజ్ఞానంతో బుల్లెట్ ట్రైన్లను తయారు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు చెప్పారు.
కోల్కతా: దేశంలో బుల్లెట్ రైళ్లపై కాదు.. జరుగుతున్న రైలు ప్రమాదాలపై దృష్టి సారించాలని, ఇటీవల జరిగిన ప్రమాదాలకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బాధ్యత వహించాలని తృణమూల్ కాంగ్రెస్ బుధవారం డిమాండ్ చేసింది. టీఎంసీ సీనియర్ నేత కునాల్ ఘోష్ మాట్లాడుతూ రైలు ప్రయాణమంటేనే ప్రయాణికులకు పీడకలగా మారిందని వ్యాఖ్యానించారు. రైల్వేలో మౌలిక సదుపాయాలు పూర్తిగా లోపించాయని, మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన సాంకేతికత అమలులో కూడా కేంద్రం వైఫల్యం చెందిందన్నారు. కొత్త రైళ్ల మోజుతో ఇప్పుడున్న వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తున్నారని వారు ఆరోపించారు.