ఇంఫాల్, అక్టోబర్ 18: ఏడాదికి పైగా ఘర్షణలతో అల్లాడుతున్న మణిపూర్‌లో ఇప్పుడు రాజకీయ సంక్షోభం ఏర్పడింది. అధికార బీజేపీలో స్పీకర్ సహా పలువురు ఎమ్మెల్యేలు అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్ బీరేన్‌సింగ్‌ను వెంటనే పదవి నుంచి తప్పించాలని 19 మంది బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ తోక్చోమ్ సత్యవ్రత్ సింగ్, మంత్రి తోంగమ్ విశ్వజిత్ సింగ్ సహా 19 మంది ఎమ్మెల్యేలు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను పునరుద్ధరించి పూర్వపు స్థితికి తీసుకురావడంలో బీరేన్ సింగ్ ప్రభుత్వం విఫలమైందని, ప్రస్తుత సంక్షోభానికి పరిష్కారం చూపాలంటూ క్షేత్ర స్థాయిలో తమపై తీవ్ర ఒత్తిడి వస్తున్నట్టు వారు పేర్కొన్నారు.
అటు రాష్ర్టాన్ని, ఇటు పార్టీని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని, భద్రతా దళాలపై ఆధారపడినంత మాత్రాన శాంతిభద్రతలు పునరుద్ధరణ కావని, రాష్ట్రంలో దిగజారిన పరిస్థితులు మెరుగవ్వాలంటే ముఖ్యమంత్రిని తొలగించడమొక్కటే మార్గమని వారు తెలిపారు. అలాగే రాష్ట్రంలోని పలు సమస్యల పరిష్కారానికి శాంతియుత చర్చలు జరిపే వాతావరణం కల్పించాలని అన్నారు. ప్రస్తుత పరిస్థితులపై తగిన చర్యలు తీసుకోకపోతే మణిపూర్‌కు తీవ్ర నష్టం జరగడమే కాక, ప్రపంచ దేశాల్లో భారత ప్రతిష్ట దెబ్బతింటుందని వారు హెచ్చరించారు.