న్యూఢిల్లీ: సిలిండర్ ధరల(LPG Prices)ను ఆయిల్ కంపెనీలు మళ్లీ పెంచేశాయి. కొత్త ధరలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. 19 కేజీల సిలిండర్లపైనే ధరలను పెంచారు. కానీ 14.2 కేజీల ఎల్పీజీ డొమెస్టిక్ సిలిండర్లపై ధరలను మాత్రం పెంచలేదు. ఇది సామాన్యులకు ఊరటను ఇచ్చే అంశమే. ఏప్రిల్ నెలలో 14.2 కేజీల సిలిండర్లపై ధరలో మార్పు ఉండబోదని ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి. ఎందుకంటే గత నెలలోనే 14 కేజీల సిలిండర్‌పై సుమారు రూ.60 పెంచారు. దీంతో మెట్రో నగరాల్లో డొమెస్టిక్ సిలిండర్ రేట్లు పెరిగాయి. ఏప్రిల్ 2025 తర్వాత తొలిసారి గత నెలలోనే 14 కేజీల సిలిండర్‌పై ధరలను పెంచడం గమనార్హం. తాజా సమాచారం ప్రకారం.. 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర మాత్రం ఢిల్లీలో రూ. 913గానే ఉంటుంది. కోల్‌కతాలో 939, ముంబైలో 912.5, చెన్నైలో 928.5గా ఉంటుంది.
19 కేజీల ఎల్పీజీ సిలిండర్‌పై మెట్రో నగరాల్లో కొత్త ఛార్జీలు వసూల్ చేయనున్నారు. ఢిల్లీలో 19 కేజీల సిలిండర్‌పై రూ.195.50 పెంచారు. ఇక కోల్‌కతాలో కమర్షియల్ సిలిండర్‌పై రూ.218 పెంచారు. పెంచిన ధరల ప్రకారం ఢిల్లీలో రూ.2087.50 కి కమర్షియల్ సిలిండర్ దొరుకుతుంది. ఈనెలలోనే ఎల్పీజీ సిలిండర్ ధర దేశవాప్తంగా రెండు వేలు దాటింది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు, హోర్ముజ్ జలసంధి మూసివేత నేపథ్యంలో సరఫరాలో అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. దీంతో ఎల్పీజీ ధరలు అమాంతం పెరిగేశాయి. చెన్నైలోనూ ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ రేటును పెంచారు. 19 కేజీల సిలిండర్‌పై ఒక్క నెలలోనే మూడుసార్లు రేట్లను పెంచేశారు. దాదాపు అయిదేళ్ల తర్వాత మళ్లీ ఎల్పీజీ రేట్లు పెరిగాయి. 2022 జూన్‌లోనూ కమర్షియల్ సిలిండర్ ధర ఓ దశలో 2100 మార్క్‌ను దాటింది.