న్యూఢిల్లీ : ఉబ్జెకిస్తాన్లో 18 మంది చిన్నారులు మృతి చెందారు. పిల్లల మరణానికి భారత్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసిన దగ్గు సిరప్ కారణమని ఉబ్జెకిస్తాన్ ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. ఫార్మాస్యూటికల్ కంపెనీ మారియన్ బయోటెక్ తయారు చేసిన డోక్-1 మ్యాక్స్ సిరప్ తాగడం వల్లే పిల్లలు చనిపోయారని మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే, ఈ కంపెనీ ఈ ఏడాదే ఉబ్జెకిస్తాన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. సమాచారం మేరకు డోక్-1 మ్యాక్స్ సిరప్ ప్రస్తుతం భారత మార్కెట్లో విక్రయించడం లేదు. ఇదిలా ఉండగా.. ఆఫ్రికన్ దేశమైన గాంబియాలో 60 మందికిపైగా పిల్లలు మృతి చెందిన విషయం తెలిసింది. ఆ తర్వాత భారత్‌లో తయారైన దగ్గు మందు సిరప్ కారణమని వార్తలు వచ్చాయి.
ఆ తర్వాత ఈ విషయంపై దర్యాప్తు కోసం కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు కమిటీని సైతం నియమించింది. అయితే, ఇప్పటి వరకు భారతీయ కంపెనీ దగ్గు సిరప్ తాగడం వల్లే పిల్లలు మృతి చెందినట్లు ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అక్టోబర్‌లో విడుదల చేసిన నివేదికలో డైథలిన్ గ్లైకాల్, ఇథిలిన్ గ్లైకాల్ మనుషులకు విషంలాంటిదని పేర్కొంది. డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ పిల్లల మరణానికి నాలుగు డ్రగ్స్‌తో సంబంధం ఉందని పేర్కొన్నారు. సిరప్లు వాడడంతో కిడ్నీలు దెబ్బతిన్నాయన్నారు. ఈ నాలుగు మందులు హర్యానాకు చెందిన మైడెన్ ఫార్మాస్యూటికల్స్‌కు చెందినవే. మరో వైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక నేపథ్యంలో నేపాల్ ఇప్పటికే భారత్‌కు చెందిన పలు ఫార్మాస్యూటికల్ కంపెనీలను బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది.