న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 513 మంది మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలున్నారు. వీరిలో 17 మంది మహిళా ప్రజాప్రతినిధులు బిలియనీర్లు. (Women MP, MLAs) ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళా చట్టసభ్యురాళ్లు దేశంలోనే చాలా రిచ్. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అండ్ నేషనల్ ఎలక్షన్ వాచ్ ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా వారి ఆర్థిక పరిస్థితిని విశ్లేషించింది. లోక్‌సభలోని 75 మంది మహిళా ఎంపీలలో ఆరుగురు, రాజ్యసభలోని 37 మందిలో ముగ్గురు, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీలకు ఎన్నికైన 400 మంది మహిళా ఎమ్మెల్యేల్లో ఎనిమిది మంది బిలియనీర్లు.
కాగా, 512 మంది మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రకటించిన మొత్తం ఆస్తులు రూ. 10,417 కోట్లు. ఒక్కో చట్టసభ్యురాలి సగటు ఆస్తి రూ.20.34 కోట్లు. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా 24 మంది ధనిక మహిళా ప్రజాప్రతినిధులున్నారు. వారి సగటు ఆస్తులు రూ. 74.22 కోట్లు. దాద్రా, నాగర్ హవేలి, డామన్ అండ్ డయ్యూకు చెందిన ఏకైక మహిళా ఎంపీ ఆస్తి రూ.71.44 కోట్లు. హర్యానాలోని 15 మంది మహిళా చట్టసభ్యుల సగటు ఆస్తి రూ.63.72 కోట్లు.
మరోవైపు అస్సాం, మిజోరాం, మణిపూర్ ఈ జాబితాలో అట్టడుగున ఉన్నాయి. ఈ రాష్ట్రాల మహిళా చట్టసభ్యుల సగటు ఆస్తులు వరుసగా రూ.2.18 కోట్లు, రూ.2.20 కోట్లు, రూ.2.84 కోట్లు అని ఏడీఆర్ తెలిపింది.