పాట్నా : బిహార్‌లో కరోనా కలకలం సృష్టించింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి పాల్గొన్న సమావేశంలో వైద్యులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. డిసెంబర్ 28న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వార్షిక కార్యక్రమం బిహార్‌లో జరిగింది. కార్యక్రమానికి హాజరైన నలంద మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌కు చెందిన 17 మంది వైద్యులకు కరోనా నిర్ధారణ అయ్యింది. ఈ కార్యక్రమంలో సీఎం నితీశ్‌కుమార్ సైతం హాజరయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా నలంద మెడికల్ కాలేజీ ధ్రువీకరించింది.
కార్యక్రమంలో పాల్గొన్న 17 మంది వైద్యులకు యాంటిజెన్ రిపోర్టులో పాజిటివ్‌గా వచ్చిందని యాజమాన్యం తెలిపింది. ఆ తర్వాత వారందరికీ ఆర్టీ పీసీఆర్ చేశామని, ఇంకా నివేదికలు రావాల్సి ఉందని పేర్కొన్నారు. సీఎంతో పాటు పెద్ద ఎత్తున వైద్యులు హాజరైన కార్యక్రమంలో పాల్గొన్న పలువురికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు ఇటీవల పెరుగుతూ వస్తున్న కొవిడ్ కేసుల మధ్య రాష్ట్రంలో ఇప్పటికే థర్డ్ వేవ్ ప్రారంభమైందని సీఎం నితీశ్‌కుమార్ ఇటీవల ప్రకటించారు.