Guillain Barre Syndrome | కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల్లో కలకలం సృష్టించినప్పటి నుంచి ఏదైనా కొత్త వైరస్ పేరు వింటేనే జనం గడగడ వణికిపోతున్నారు. ఏ రోగం ఎంత విధ్వంసం చేస్తుందోనని హడలిపోతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం గులియన్ బారే సిండ్రోమ్ (Guillain Barre Syndrome) వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర (Maharashtra)లో ఈ జీబీఎస్ (GBS) కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.
తాజా సమాచారం ప్రకారం.. ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 192 గులియన్ బారే సిండ్రోమ్ అనుమానిత కేసులు నమోదు కాగా అందులో 167 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇక ఈ వైరస్ కారణంగా ఏడు మరణాలు కూడా నమోదయ్యాయి. అందులో ఒకరు GBS కారణంగానే మరణించినట్లు నిర్ధరణ అయ్యింది. మిగతా 6 కేసులపై అనుమానాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
కాగా, 167 కేసుల్లో.. పూణే మున్సిపల్ కార్పొరేషన్ (PMC) పరిధిలో 39, ఇతర గ్రామాల నుంచి 91, పింప్రి చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ (PCMC) నుంచి 29, పూణే రూరల్ ఏరియాలో 25, ఇతర జిల్లాల నుంచి 8 కేసులు రికార్డయ్యాయి. ప్రస్తుతం 48 మంది రోగులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నారు. అందులో 21 మంది వెంటిలేటర్లపై ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక చికిత్స అనంతరం సుమారు 91 మంది బాధితులు ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించారు.
కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రభావిత ప్రాంతాల్లో నిఘాను పెంచి నివారణ చర్యలను వేగవంతం చేసింది. వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో పూణె మున్సిపల్ కార్పొరేషన్.. పూణే నగరంలోని సింహగడ్ రోడ్డులోని నాందేడ్ గ్రామం, ధయారి, పరిసర ప్రాంతాల్లో 30 ప్రైవేట్ నీటి సరఫరా ప్లాంట్లను సీజ్ చేసింది. ప్రజలు పలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది.
జీబీఎస్ అంటే ఏమిటి..?
జీబీఎస్ అంటే గులియన్ బారే సిండ్రోమ్. ఈ గులియన్ బారే సిండ్రోమ్ అనేది ఒక రకమైన ఆటో ఇమ్యూన్ (ఒక వ్యక్తిలోని రోగనిరోధక వ్యవస్థ తనలోని ఆరోగ్య కణాలనే శత్రువులుగా భావించి దాడి చేయడం) సిండ్రోమ్. ఈ సిండ్రోమ్ బారినపడిన వ్యక్తిలో ఉన్న రోగనిరోధక వ్యవస్థ అతని నాడీ వ్యవస్థపైనే దాడి చేస్తుంది. అందుకే దీన్ని ఆటో ఇమ్యూన్ సిండ్రోమ్ అని అంటారు. ఈ సిండ్రోమ్‌వల్ల బాధితుడిలోని నరాలు, కండరాలు బలహీనంగా మారుతాయి. వివిధ రకాల వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు సోకిన వారు.. అలాంటి సమయంలో ఈ గులియన్ బారే సిండ్రోమ్ బారిన పడే ప్రమాదం కూడా ఉంది.
లక్షణాలు ఎలా ఉంటాయి..?
జీబీఎస్ బారినపడిన వ్యక్తిలో సొంత రోగనిరోధక వ్యవస్థ దాడి చేయడంవల్ల నాడీ వ్యవస్థ క్రమంగా నిర్వీర్యం చేస్తుంది. ముందుగా పాదాల నుంచి మొదలై పైవరకు ఈ సిండ్రోమ్ పాకుతుంది. దాంతో కాళ్లు మొదలు ఒంట్లోని ఒక్కో భాగం కదలికలేకుండా పోతుంది. కండరాలు బలహీనమవుతాయి. దాంతో భరించలేని నొప్పి కలుగుతుంది. విపరీతమైన నిస్సత్తువ ఏర్పడుతుంది. ఈ సిండ్రోమ్ పెద్దవాళ్లలో, ముఖ్యంగా మగవాళ్లలో ఎక్కువగా సంక్రమిస్తుంది. అయితే, అత్యంత అరుదుగానైనా అన్ని వయసుల వారికి ఈ సిండ్రోమ్ ముప్పు పొంచి ఉంటుంది. జీబీఎస్ తాలూకూ అత్యంత ప్రధాన లక్షణం విపరీతమైన నీరసమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరోలాజికల్ డిజార్డర్స్ అండ్ స్ట్రోక్స్ వెల్లడించింది. తొలి దశలో మెట్లెక్కుతుంటేనో, నడుస్తుంటేనో కూడా విపరీతమైన నీరసం రావడాన్ని దీని తొలి లక్షణంగా భావించవచ్చు.
తర్వాతి దశలో శ్వాసప్రక్రియను నియంత్రించే కండరాలు బాగా బలహీనపడతాయి. ఎంతలా అంటే మెషిన్ సాయంతో ఊపిరి తీసుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఈ లక్షణాలు తలెత్తిన రెండే రెండు వారాల్లో సమస్య బాగా ముదిరి రోగిని కదల్లేని స్థితికి చేరుస్తుంది. నరాలు బాగా దెబ్బ తింటాయి కాబట్టి నరాల వ్యవస్థ నుంచి మెదడుకు అస్తవ్యస్త సంకేతాలు అందుతుంటాయి. దాంతో చర్మంలోపల పురుగులు పాకుతున్నట్టు చెప్పలేని బాధ కలుగుతుంది. దవడలు నొప్పిగా మారుతాయి. మాట్లాడటం, నమలడం, మింగడం ఇబ్బందిగా ఉంటుంది. హృదయ స్పందనలో, రక్తపోటులో తేడాలు వస్తాయి. జీర్ణశక్తి మందగిస్తుంది.
Also Read..
Punjab CM | పంజాబ్‌లో సీఎంను తొలగించబోతున్నారా..?
Naxal Violence: చత్తీస్‌ఘడ్‌లో 47 శాతం తగ్గిన నక్సల్ హింస: కేంద్ర ప్రభుత్వం